ఢిల్లీ : జామియా వర్శిటీలో విద్యార్ధులపై కాల్పులు..!

  • Published By: veegamteam ,Published On : January 30, 2020 / 09:08 AM IST
ఢిల్లీ : జామియా వర్శిటీలో విద్యార్ధులపై కాల్పులు..!

దేశ రాజధాని ఢిల్లీలోని జామియా యూనివర్శిటీలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. వర్శిటీ విద్యార్ధులు పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో ఆందోళన చేస్తున్నవారిపై ఓ వ్యక్తి హఠాత్తుగా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ విద్యార్ధికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న పోలీసులు కాల్పులు జరిపిన అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన విద్యార్ధిని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. 

కాగా..కాల్పులు జరిపిన వ్యక్తి విద్యార్ధులపై కాల్పులు జరుపుతూ..‘‘మీరు స్వేచ్ఛను కావాలనుకుంటున్నారు కదూ అయితే తీసుకోండి’’అంటూ వ్యాఖ్యానించటం గమనించాల్సిన విషయం. సీఏఏకు వ్యతిరేకంగా జామియా వర్శిటీ విద్యార్ధులు మరోసారి ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు (జనవరి 30,2020) వర్శిటీ నుంచి రాజ్ ఘడ్ వరకూ విద్యార్ధులు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ర్యాలీకి పోలీసులు పర్మిషన్ కోరారు. కానీ  మహాత్మాగాంధీ 72వ వర్థంతి సందర్భంగా రాజ్ ఘాట్ వద్ద ప్రముఖ రాజకీయ నేతలంతా గాంధీకి నివాళులర్పించే కార్యక్రమం ఉండటంతో విద్యార్ధుల ర్యాలీకి పోలీసులు అనుమతి లభించలేదు.

దీంతో పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంతో విద్యార్ధులు వర్శిటీలోనే తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి హఠాత్తుగా ఆందోళనకారులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతను ఎవరు? ఎందుకు విద్యార్ధులపై కాల్పులు జరిపాడు అనే కోణంలో విచారిస్తున్నారు. 

కాగా..గత డిసెంబర్ లో కూడా పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలతో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు. సీఏఏపై విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసించడం.. సీఏఏను సమర్ధిస్తున్న కొంతమంది అడ్డుకోవటంతో అక్కడ అల్లర్లు చెలరేగాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులపై లాఠీ ఝళిపించారు. ఈ ఘటనతో పలువురు విద్యార్ధులకు గాయాలు అయ్యాయి.