Hardik Patel: కాంగ్రెస్‌కు హార్ధిక్ పటేల్ ఝలక్

ఇటీవల వరుసగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న ఆ పార్టీ గుజరాత్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ హార్థిక్ పటేల్ మరోసారి కాంగ్రెస్ నాయకత్వంపై విరుచుకుపడ్డారు.

Hardik Patel: కాంగ్రెస్‌కు హార్ధిక్ పటేల్ ఝలక్

Hardik Patel

Hardik Patel: ఇటీవల వరుసగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న ఆ పార్టీ గుజరాత్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ హార్థిక్ పటేల్ మరోసారి కాంగ్రెస్ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. గుజరాత్‌లోని కాంగ్రెస్ నాయకత్వంతోనే తనకు సమస్య ఉందని, పార్టీలోని ఇతర నాయకులతో కాదని హార్ధిక్ పటేల్ అన్నాడు. పార్టీ నాయకత్వం ఎవరినీ పనిచేయనివ్వదని, ఎవరైనా పనిచేస్తుంటే అడ్డుకుంటారని విమర్శించాడు. గుజరాత్‌లో జరిగిన ఒక పబ్లిక్ మీటింగ్‌లో శుక్రవారం హార్థిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము (కాంగ్రెస్ నేతలు) రామ భక్తులమని, బీజేపీని రాష్ట్రంలో తక్కువ అంచనావేయొద్దని అన్నాడు.

 

‘‘గుజరాత్ కాంగ్రెస్ నాయకత్వం ఎవరినీ పనిచేయనివ్వదు. ఈ అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లా. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం హామీ ఇచ్చింది. ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాలి. అలాగే నేను వేరే పార్టీలో చేరడం గురించి కూడా ఆలోచించడం లేదు. గుజరాత్‌లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్రజల పక్షాన నిలబడాలి. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఒకవేళ ప్రతిపక్షం ఆ పని చేయలేకపోతే ప్రజలు మరో ప్రత్యామ్నాయం చూసుకుంటారు’’ అని చెప్పుకొచ్చాడు. మరోవైపు బీజేపీపై కూడా ప్రశంసలు కురిపించాడు.

‘‘2014లో మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి, ఆ పార్టీ సిద్ధాంతాలకు దేశం ప్రభావితమవుతోంది. బీజేపీకి గట్టి పునాది ఉంది. ఆ పార్టీ నాయకత్వం త్వరగా, సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. మనకు (కాంగ్రెస్) ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ బలంగా ఉంది. శత్రువును ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. నేనే బీజేపీలో చేరడం గురించి ఆలోచించడం లేదు’’ అని వ్యాఖ్యానించాడు హార్థిక్ పటేల్. కొంతకాలంగా ఆయన కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాుడు. ఈ ఏడాది గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హార్థిక్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. సొంతపార్టీపైనే విమర్శలు చేస్తుండటం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగిస్తోంది.