ఫాలోవర్స్ కు ఓట్లు లేవుగా : చిత్తుగా ఓడిన బీజేపీ టిక్ టాక్ స్టార్

ఫాలోవర్స్ కు ఓట్లు లేవుగా : చిత్తుగా ఓడిన బీజేపీ టిక్ టాక్ స్టార్

హర్యానాలో బీజేపీ అభ్యర్థిగా ఆడంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన టిక్ టాక్ స్టార్ సోనాలి పొగట్ ఓటమిపాలయ్యారు. మూడుసార్లు అదే నియోజకవర్గానికి  ప్రాతినిధ్యం వహించిన  కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిషోయ్ చేతిలో ఆమె ఘోర ఓటమి పాలయ్యారు. 30వేల మెజార్టీతో బిషోయ్ గెలుపొందారు. బిషోయ్ కి 64వేల ఓట్లు పోల్ అవగా,సోనాలికి 30వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. బిషోయ్ కుటుంబానికి కూడా 50ఏళ్లుగా ఆడంపూర్ అసెంబ్లీ స్థానం కంచుకోటగా ఉంది. టిక్‌టాక్‌లో జనాదరణ లెక్కించబడదు. పని యొక్క ప్రజాదరణ లెక్కించబడుతుందని బిషోయ్ అన్నారు. 

ఇవాళ ఉదయం కౌంటింగ్ ప్రారంభం అయినప్పుడు సోనాలి మాట్లాడుతూ..ఆడంపూర్ లో తన విజయం ఖాయమని,అదేవిధంగా హర్యానాలో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు.తనను గెలిపిస్తే దేశం కోసం టిక్ టాక్ చేస్తానని గతంలో ఆమె వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం హర్యానా హంగ్ అసెంబ్లీ దిశగా నడుస్తోంది. ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి కనబడుట లేదు. మొత్తం 90స్థానాలున్న హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 46గా ఉంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ 38,కాంగ్రెస్ 34స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ కింగ్ మేకర్ గా మారే అవకాశముంది. 10స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది.