వెరీ డేంజర్ : మార్కెట్ లో హోలీ క్యాప్సుల్స్..బాంబులు 

  • Published By: veegamteam ,Published On : March 20, 2019 / 03:51 AM IST
వెరీ డేంజర్ : మార్కెట్ లో హోలీ క్యాప్సుల్స్..బాంబులు 

చండీగఢ్: హోలీ పండుగ అంటే వయస్సుతో సంబంధం లేకుండా సంబరాలు చేసుకునే వేడుక. రంగులు మయం..ఇంద్రధనస్సుని తలపించే రంగుల్లో మునిగి కేరింతలు కొట్టే అందమైన పండుగ హోలీ. కానీ రాను రాను పండుగల రూపు మార్చుకుంటు కొత్త పంథాలు అనుసరిస్తున్నాయి. ఈ క్రమంలో సహజసిద్ధమైన రంగులతో హోలీ వేడుకలకు బదులుగా కృత్రిమ రంగులతోనే చేసుకోవటం జరుగుతోంది. అంతేకాదు ఇప్పుడు ఆ రంగులకు బందులు మార్కెట్ లోకి హోలీ క్యాప్సుల్స్ కూడా వచ్చేశాయి. అంతేకాదండోయ్ హోలీ బాంబులు కూడా హల్ చల్ చేస్తున్నాయి మార్కెట్ లో .
 

దీపావళి వస్తున్నదంటే కాలుష్యాన్ని నియంత్రించాలనే నినాదాలు వినిపిస్తుంటాయి. ఇప్పుడు రంగుల హోలీ పండుగలో కూడా ఇటువంటి డిమాండ్సే వినిపిస్తున్నాయి. దేశంలో హోలీ వేడుకలు మిన్నంటుతున్నవేళ..మార్కెట్‌లోకి హోలీ క్యాప్సుల్స్, బాంబులు ప్రవేశించాయి. అత్యంత హానికారకమైన వీటిని అడ్డుకునేందుకు ఎవరూ ప్రయత్నించడంలేదనే ఆరోపణలు కూడా  వినిపిస్తున్నాయి. మెడిసిన్ క్యాప్సుల్ మాదిరిగా కనిపించే వీటిని నీటిలో వేయగానే క్షణాల్లో ఆ నీరంతా రంగులోకి మారిపోతుంది. అటువంటివి 50 క్యాప్సుల్స్ ఉండే  ప్యాకెట్‌ను రూ. 20కి అమ్ముతున్నారు. చిన్నపిల్లలెవరైనా వీటిని వేడుకల్లో భాగంగా పొరపాటున నోటిలోకి వెళితే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక హోలీ బాంబుల విషయానికొస్తే.. ఈ బాంబులలో రంగును ఫిల్ చేస్తారు. వీటిని వెలిగిస్తే..దీంట్లో ఉండే  రంగు ఫౌంటెన్ లా పెద్ద ఎత్తున వెదజల్లుతుంది. ఈ బాంబుల ధర  ఒకొక్కటీ రూ. 40లు. ఈ బాంబులతో వాయు కాలుష్యం ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరి వీటిపై ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే వాయు కాలుష్యం..జల కాలుష్యంతో ప్రజల ఆరోగ్యాలు ప్రమాదంలో పడుతున్న క్రమంలో పండుగల పేరుతో ఇటువంటి ఆర్టిఫిషియల్ వేడుకలను అరికట్టేందుకు వెంటనేతగిన చర్యలు తీసుకోవాలి.