భారత్ లో ముస్లింలకు రక్షణ లేదు..మాజీ ఉపరాష్ట్రపతి

భారత్ లో ముస్లింలకు రక్షణ లేదు..మాజీ ఉపరాష్ట్రపతి

Hamid Ansari భారత్ లో ముస్లింలకు రక్షణ లేదని మాజీ ఉపరాష్ట్రపతి అమిద్ అన్సారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్ర‌ముఖ న్యూస్ చానెల్ జీ న్యూస్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ డిక్షనరీలో లౌకికవాదం అనే పదానికి తావులేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2014కు ముందు ఉన్న ప్రభుత్వ డిక్షనరీలో లౌకికవాదం అనే పదం ఉందా అన్న ప్రశ్నకు…ఉంది,కానీ పూర్తిగా కాదు అని సమాధానమిచ్చారు.

తాను ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఉన్న చివ‌రి వారంలో రెండు ఘ‌ట‌న‌లు కొన్ని వ‌ర్గాల్లో కోపానికి కార‌ణ‌మ‌య్యాయ‌ని, త‌న ప్ర‌క‌ట‌న వెనుక ర‌హ‌స్య ఎజెండా ఉందని దేశ ప్రజలు అనుకున్నట్టు ఆయన వెల్లడించారు. త‌న కొత్త పుస్త‌కం బై మెనీ ఎ హ్యాపీ యాక్సిడెంట్‌: రీక‌లెక్ష‌న్ ఆఫ్ ఎ లైఫ్‌లో తాను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో సంభాషించిన అంశాల‌ను ప్ర‌స్తావించారు.

పదేళ్లు ఉప రాష్ట్ర‌ప‌తిగా ఉన్నారని, ఎంఎంయూ వీసీగా, మైనార్టీ క‌మిష‌న్ చీఫ్‌గా, దౌత్య‌వేత్త‌గా పని చేశారని, ఈ దేశం మీకు చాలా ఇచ్చిందని, అయితే మీరు ప‌ద‌విలో ఉన్న చివ‌రి రోజుల్లో ముస్లింల‌కు రక్షణ లేద‌ని ఎందుకు వ్యాఖ్యానించాల్సి వ‌చ్చిందన్న ప్రశ్నకు…తాను ప్ర‌జ‌ల అభిప్రాయాల ఆధారంగానే ఆ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు హన్సారీ చెప్పారు. ముస్లింల‌పై జ‌రిగిన దాడుల‌ను ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌స్తావించారు. అయితే,. హిందువులపై దాడులు జరగలేదా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ…ఉండొచ్చని పేర్కొన్నారు. ముస్లింలకు ఎందుకు ర‌క్ష‌ణ లేద‌ని అనుకుంటున్నార‌ని ప్ర‌శ్నించ‌గా.. ఆయ‌న నేరుగా స‌మాధానం చెప్ప‌లేదు. ఆ వెంట‌నే ఆయ‌న ఇంట‌ర్వ్యూ నుంచి మ‌ధ్య‌లోనే లేచి వెళ్లిపోయారు. కాగా, మూడేళ్ల క్రితం కూడా అన్సారీ ఇదేవిధమైన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కూడా ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయైన విషయం తెలిసిందే.