PM Modi in JandK: ఆర్టికల్ 370 రద్దు అనంతరం మొదటిసారి జమ్మూ కాశ్మీర్ లో ప్రధాని మోదీ పర్యటన
ఉదయం 11 గంటలకు జమ్మూకాశ్మీర్ సాంబా జిల్లాలో పల్లి పంచాయితీ ప్రాంతానికి చేరుకోనున్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు

Pmmodi
PM Modi in JandK: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జమ్మూకాశ్మీర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 11 గంటలకు జమ్మూకాశ్మీర్ సాంబా జిల్లాలో పల్లి పంచాయితీ ప్రాంతానికి చేరుకోనున్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి ఆ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పర్యటించడం ఇదే ప్రధమం. అదే సమయంలో కాశ్మీర్ లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని పర్యటన వివరాల్లోకి వెళితే ఉదయం సాంబా జిల్లా పల్లి పంచాయితీకి చేరుకున్న అనంతరం 11:30కి జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని గ్రామసభలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈసందర్భంగా పల్లి పంచాయతీ పరిధిలో నిర్మించిన 500 కిలోవాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.
Also read:Narendra Modi: పెరుగుతున్నకరోనా.. సీఎంలతో మోదీ మీటింగ్
ఈ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో దేశంలోనే మొదటి కార్బన్ న్యూట్రల్ గా పల్లి పంచాయతీ మారుతుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. అనంతరం జమ్మూకాశ్మీర్ లో రూ. 3100 కోట్ల వ్యయంతో నిర్మించిన బనిహాల్ – ఖాజిగుండ్ రోడ్ టన్నెల్‌ను మోదీ ప్రారంభిస్తారు. బనిహాల్ – ఖాజిగుండ్ మధ్య 8.45 కి.మీ పొడవైన సొరంగ మార్గం అందుబాటులోకి వస్తే 16 కి.మీ రహదారి దూరాన్ని తగ్గించి వాహనదారులకు ఎంతో సమయం ఆదా అవుతుంది. సుమారు గంటన్నర ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు వెల్లడించారు. అనంతరం చీనాబ్ నదిపై నిర్మించనున్న రాట్లే, క్వార్ రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. కిష్త్వార్ జిల్లాలోని చీనాబ్ నదిపై 850 మెగావాట్ల సామర్ధ్యంతో రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టును, 540 మెగావాట్ల సామర్ధ్యంతో క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టును కేంద్రం నిర్మించనుంది.
Also read:Cooking Oil Price Hike: సామాన్యుడిపై మరో బాంబ్.. మళ్ళీ పెరగనున్న వంట నూనె ధరలు!