100 లోన్ యాప్స్ ని ప్లే స్టోర్ నుంచి తొలగించిన గూగుల్

100 లోన్ యాప్స్ ని ప్లే స్టోర్ నుంచి తొలగించిన గూగుల్

Loan App Scam

loan apps తక్షణ రుణాల పేరిట ప్రజలను పీక్కుతింటున్న పలు లోన్‌ యాప్ లపై గూగుల్‌ చర్యలకు దిగింది. దాదాపు 100 లోన్ యాప్‌లపై గూగుల్ నిషేధం విధించింది. ఈ యాప్‌లు తాము విధించిన నిబంధనలను పాటించడం లేదని, భద్రతా విధానాలను ఉల్లంఘించాయని..డాటాను దుర్వినియోగం చేయడమే కాకుండా ఎక్కువ మొత్తం వడ్డీలు వసూలు చేస్తున్నారని కనుగొన్నట్లు గూగుల్ పేర్కొన్నది. వీటికి సంబంధించిన యాప్‌లను తమ ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. అయితే, నిషేధం విధించిన యాప్‌ల వివరాలను గూగుల్ వెల్లడించలేదు. కొన్ని రోజుల క్రితం గూగుల్ డెవలపర్లు యూజర్ సమ్మతి ఇచ్చిన పనుల కోసం మాత్రమే డాటాను ఉపయోగించాలని చెప్పారు. డాటాను మరో చోట ఉపయోగించాలనుకుంటే యూజర్ ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ప్లే స్టోర్‌లో బోలెడు
గూగుల్ ఇప్పటికీ ఇలాంటి వ్యక్తిగత రుణ యాప్‌లను ఎన్నింటినో తన ప్లే స్టోర్‌లో కలిగి ఉంది. ప్రభుత్వ యాప్‌లతో పాటు అనేక ప్రైవేట్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల యాప్‌లు కూడా వీటిలో ఉన్నాయి. రుణాలు ఇచ్చే సంస్థ లిస్టెడ్ వెబ్‌సైట్ లేదా దాని యాప్‌కు వెళ్తుందని ఆర్‌బీఐ చెప్తున్నది. అయితే, అది ఆర్‌బీఐలో రిజిస్టర్ చేయబడిందో లేదో తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. లేదా ఆర్‌బీఐలో నమోదు చేసుకున్న ఏదైనా బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణం పొందడం చాలా మంచిది. రుణం అందించే అన్ని కంపెనీలు తమ కంపెనీ ఐడెంటిఫికేషన్ నంబర్ (సీఐఎన్), సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (సీఓఆర్) ను స్పష్టంగా చూపించాలి.

ఇక ఈ యాప్‌ల గురించి వినియోగదారులు, ప్రభుత్వ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ యాప్‌ల ద్వారా రుణాలపై అధిక వడ్డీకి సంబంధించిన ఫిర్యాదులు తమకు అనేకం వచ్చాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ లిఖితపూర్వక సమాధానంలో బుధవారం పార్లమెంటుకు తెలిపింది. ఇది కాకుండా, వ్యక్తిగత డాటా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులను కూడా ప్రభుత్వం స్వీకరిస్తుందని అందులో పేర్కొన్నారు.