భయం భయం : భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

  • Published By: madhu ,Published On : March 4, 2020 / 12:37 AM IST
భయం భయం : భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా మొత్తం 6 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా జైపూర్‌లో ఇటాలియన్‌ టారిస్ట్‌కు వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో అతడ్ని ఐసోలేటెడ్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక- ఢిల్లీలో కరోనా బాధితుడికి చికిత్స కొనసాగుతోంది.

కరోనా వైరస్ వ్యాప్తి భయంతో నోయిడాలోని ఓ ప్రైవేటు పాఠశాలకు మూడ్రోజుల పాటు సెలవు ప్రకటించారు. కరోనా వైరస్ రోగికి చెందిన ఇద్దరు పిల్లలు నోయిడాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. కరోనా రోగి పిల్లలు సోమవారం పాఠశాలకు రాలేదనే విషయాన్ని కొందరు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు వాట్సాప్ గ్రూపులో సందేశాలు పెట్టారు. తమ పిల్లల్ని స్కూలుకు పంపిస్తే కరోనా వైరస్ సోకుతుందనే భయంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలకు పంపించలేదు. దీంతో పాఠశాలకు మూడ్రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు నోయిడా పాఠశాల యాజమాన్యం ప్రకటించింది.(ప్రయాణికులు ఆందోళన చెందవద్దు..కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం : మెట్రో రైలు ఎండీ)

కరోనా కారణంగా ఎయిర్‌ఇండియా తమ ప్రయాణికులను అప్రమత్తం చేసింది. ఫిబ్రవరి 25న వియన్నా నుంచి ఢిల్లీకి ప్రయాణించిన వారిని స్క్రీనింగ్‌ సంబంధించి ఆరోగ్య శాఖ ప్రతిపాదించిన ప్రోటోకాల్ పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఎయిర్‌ఇండియా విమానంలో ఫిబ్రవరి 25న వియన్నా నుంచి దిల్లీకి ప్రయాణించిన వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్దారించారు. దీంతో అతడి తోటి ప్రయాణికులు సైతం పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. ఇప్పటికే ఆ విమానంలో విధులు నిర్వహించిన 10 మంది సిబ్బందిని ఇంటి వద్దే 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండమని సంస్థ సూచించింది.

ఏ మాత్రం వైరస్‌ లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదించాలని కోరింది. మరోవైపు వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప ఇటలీ, ఇరాన్‌, దక్షిణకొరియా, చైనా, సింగపూర్‌ వెళ్లవద్దని సూచించింది. మరోవైపు దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి పట్ల భయాందోళన అవసరం లేదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వైరస్‌ నుంచి ఎవరికి వారు స్వయంగా రక్షణ పొందేందుకు జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై తాను పలువురు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృతంగా సమీక్షించానని ప్రధాని ట్వీట్‌ చేశారు.