Kandahar Consulate : తాలిబన్ ఎఫెక్ట్..ప్రత్యేక విమానంలో ఢిల్లీకి కాందహార్ కాన్సులేట్ సిబ్బంది

ఆఫ్గనిస్తాన్ భూభాగంపై తాలిబన్లు పట్టుసాధిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Kandahar Consulate : తాలిబన్ ఎఫెక్ట్..ప్రత్యేక విమానంలో ఢిల్లీకి కాందహార్ కాన్సులేట్ సిబ్బంది

Afganistan

Kandahar Consulate ఆఫ్గనిస్తాన్ భూభాగంపై తాలిబన్లు పట్టుసాధిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాందహార్‌లో ఉన్న భారత కాన్సులేట్(రాయబార కార్యాలయం మొక్క బ్రాంచ్ ఆఫీస్) లో పనిచేసే దాదాపు 50మంది దౌత్యవేత్తలు మరియు ఇతర సిబ్బందిని శనివారం రాత్రి ప్రత్యేక వాయుసేన విమానంలో న్యూఢిల్లీకి తీసుకొచ్చారు. అయితే ఈ వాయుసేన విమానం పాకిస్తాన్ వాయు మార్గం నుంచి కాకుండా మరొక మార్గం నుంచి న్యూఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం.

అయితే కాందహార్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ని మూసివేయలేదు. కాందహార్ నగరానికి సమీపంలో ఆఫ్గన్ ప్రభుత్వ దళాలు మరియు తాలిబన్ల మధ్య తీవ్రమైన పోరాటం కారణంగా కాన్సులేట్ లోని భారతదేశానికి చెందిన సిబ్బందిని ప్రస్తుతానికి తిరిగి తీసుకువచ్చారు. పరిస్థితి స్దదుమణిగే వరకు ఇది పూర్తిగా తాత్కాలిక చర్య మాత్రమే. కాందహార్ లోని భారత కాన్సులేట్ స్థానిక సిబ్బందితో కొనసాగుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు, ఆఫ్ఘ‌నిస్థాన్‌లో దిగ‌జారుతున్న భ‌ద్ర‌తా ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తున్నామ‌ని, అక్క‌డి భార‌తీయుల భ‌ద్ర‌త కోసం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఇప్ప‌టికే కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో చెప్పిన విష‌యం తెలిసిందే.

కాగా, ఆఫ్గనిస్థాన్‌లో అమెరికా త‌న బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించుకుంటుండ‌టంతో అక్క‌డ గ‌త కొన్ని వారాలుగా వ‌రుస‌గా ఉగ్ర‌వాద దాడులు జ‌రుగుతున్నాయి. సుమారు రెండు ద‌శాబ్దాల పాటు అమెరికా మిలిట‌రీ ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ఉంది. ఆగ‌స్ట్ చివ‌రిలోగా బ‌ల‌గాలను మొత్తం ఉప‌సంహ‌రించాల‌ని అమెరికా భావిస్తుండ‌టంతో అక్క‌డ మ‌ళ్లీ తాలిబ‌న్లు రాజ్య‌మేల‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. అఫ్గానిస్తాన్- ఇరాన్ మధ్య ముఖ్యమైన వాణిజ్య మార్గాలలో ఒకటైన ఇస్లామ్ కాలా బోర్డర్ సహా 85 శాతం ఆఫ్గనిస్తాన్ భూభాగం తమ కంట్రోల్ లో ఉందని తాలిబన్ సంస్థ శుక్రవారం ప్రకటించింది. దేశంలోని మొత్తం 398 జిలాల్లో..250జిల్లాల వరకు తమ ఆధీనంలో ఉన్నాయని తాలిబన్ ప్రకటించింది.

దక్షిణ ప్రాంతంలో కాందహార్ చుట్టుపక్కల ప్రాంతాలపై తాలిబన్లు పట్టుబిగించారు. ఏ క్షణంలోనైనా ఉగ్ర మూకలు నగరంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆఫ్ఘాన్ భద్రతా బలగాలతో భీకర యుద్ధం లాంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. తాలిబన్ల సాయంతో లష్కరే తొయిబా ఉగ్రవాదులు కూడా మరింతగా రెచ్చిపోయి భీకర దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తాలిబన్లు, లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఆఫ్గాన్ దళాలపై దాడులు చేశారు. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయానికి కూడా ఉగ్రమూక నుంచి ముప్పు పొంచివున్న క్రమంలో భారత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా రాయబార కార్యాలయ సిబ్బందిని భారత్‌కు రప్పించినట్లు తెలుస్తోంది.

మరోవైపు,తాలిబన్లతో తలపడలేక వందల సంఖ్యలో ఆఫ్గనిస్తాన్ సైనికులు పొరుగునున్న తజకిస్తాన్ కి పారిపోతున్నారు. తజకిస్తాన్ ఇప్పటికే సరిహద్దుల్లోకి భారీగా బలగాలను తరలించింది. రష్యా కూడా తజకిస్తాన్ లోని తన సైనిక స్థావరాన్ని బలోపేతం చేస్తోంది.