పాక్ కమిటీలో వేర్పాటు నేత…కర్తార్ పూర్ మీటింగ్ కి భారత్ దూరం

  • Published By: venkaiahnaidu ,Published On : March 29, 2019 / 11:49 AM IST
పాక్ కమిటీలో వేర్పాటు నేత…కర్తార్ పూర్ మీటింగ్ కి భారత్ దూరం

 భారత్‌-పాక్‌ల మధ్య ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కర్తార్‌పూర్‌ కారిడార్‌ పై ఏప్రిల్‌-2,2019న జరుగబోయే సమావేశానికి హాజరుకాకూడదని భారత్ నిర్ణయించింది.కర్తార్‌పూర్ నిర్మాణంపై పాక్‌ నియమించిన కమిటీలో ఖలిస్థాన్‌ వేర్పాటువాద నేతలు ఉండడమే దీనికి కారణం.ఈ మేరకు శుక్రవారం(మార్చి-29,2019) పాక్‌ డిప్యూటీ హై కమిషనర్‌ కు భారత్‌ సమన్లు పంపించింది.కమిటీలో ఖలిస్తాన్ వేర్పాటువాద నేతలపై తమ అభ్యంతరాలను తెలియజేసింది.
Read Also : దేన్నీ వదలటం లేదు : రైల్వేలో టీ కప్పులపై మోడీ చౌకీదార్

కర్తార్ పూర్ కారిడార్‌ నిర్మాణ ప్రక్రియపై పది మంది సభ్యులతో ఓ కమిటీని పాక్ బుధవారం(మార్చి-27,2019) ప్రకటించింది. అయితే ఈ కమిటీలో ఖలిస్థాన్‌ వేర్పాటువాద నేత గోపాల్‌ సింగ్ చావ్లా పేరుని కూడా పాక్ చేర్చింది.గత ఏడాది నవంబర్‌లో అమృత్‌సర్‌ లోని నిరంకారీ భవన్‌పై జరిగిన దాడిలో గోపాల్‌ సింగ్‌ ప్రధాన నిందితుడు. లాహోర్‌లోని గురుద్వారాలోకి భారత అధికారులు ప్రవేశించడాన్నీ ఆయన అడ్డుకున్నారు.అంతేకాకుండా లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కి గోపాల్ సన్నిహితుడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.దీంతో గోపాల్‌ కమిటీలో ఉండడంపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 

పాక్‌ నియమించిన కమిటీలో వివాదాస్పద వ్యక్తుల్ని చేర్చడం పట్ల భారత్‌ వివరణ కోరింది. దీనిపై పాక్‌ స్పందించిన తర్వాతే కారిడార్‌ నిర్మాణ విధివిధానాలపై తదుపరి సమావేశం ఉంటుంది. ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని భారత్‌ కూడా కోరుకుంటోంది. అయితే దేశ శాంతి, భద్రతలను పణంగా పెట్టలేమని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.అలాగే కారిడార్‌ నిర్మాణంపై జరిగిన చివరి సమావేశంలో భారత్‌ కొన్ని అంశాల్లో స్పష్టత కోరిందని.. వాటికి పాక్‌ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదని ప్రకటనలో తెలిపారు.

కారిడార్‌ నిర్మాణంలోని సాంకేతిక అంశాలపై చర్చించడానికి నిపుణుల సమావేశం ఏప్రిల్‌ రెండో వారం చివర్లో నిర్వహించడానికి భారత్‌ ప్రతిపాదనలు పంపింది. ఈ అంశంపై ఇరు దేశాలకు చెందిన అధికారులు మార్చి ఆరంభంలో ఇప్పటికే ఓసారి సమావేశమయ్యారు. 
Read Also : ప్రయాణికులకు గుడ్ న్యూస్ : వెయ్యి రైల్వే స్టేషన్లలో ఫ్రీ Wi-Fi