చైనాకు బిగ్ షాక్​… భారత్ అధీనంలో కీలక ప్రాంతం

  • Published By: venkaiahnaidu ,Published On : September 1, 2020 / 08:55 PM IST
చైనాకు బిగ్ షాక్​… భారత్ అధీనంలో కీలక ప్రాంతం

పాంగాంగ్​ సో సరస్సు దక్షిణ తీరంలోని కీలక పర్వత శిఖరాన్ని భారత సైన్యం అధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వెంబడి చైనా ఏర్పాటు చేసిన అత్యాధునిక కెమెరాలు, పరికరాల కళ్లుగప్పి భారత బలగాలు ఇలా చేయడం విశేషం. ఈ కీలక పర్వత శిఖరంపై పాగా వేసిన వెంటనే… చైనా ఏర్పాటు చేసి ఉంచిన కెమెరాలను, నిఘా పరికరాలను భారత బలగాలు తొలగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

తూర్పు లడఖ్ ‌లో నిబంధనలు – ఒప్పందాలను ఉల్లంఘిస్తూ.ఆగస్ట్​ 29-30 అర్ధరాత్రి దొంగదెబ్బ తీసి పాంగాంగ్​ దక్షిణ తీరాన్ని, పర్వత శిఖరాన్ని ఆక్రమించేందుకు చైనా యత్నించింది. ఆగస్టు 29 అర్ధరాత్రి పాంగోంగ్‌ సో సరస్సు దక్షిణం ఒడ్డుకు చైనా బలగాలు ఆర్మీ క్యాంప్ ఏర్పాటు చేశాయి. 500 చైనా సైనికులు అక్కడ మోహరించారు. ఈ పరిణామాలను ముందే ఊహించిన భారత్ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. భారత బలగాలను చూసిన చైనా సైన్యం తోకముడిచింది. దీంతో పాంగాంగ్​ సో సరస్సు దక్షిణ తీరంలోని కీలక పర్వత శిఖరాన్ని భారత సైన్యం అధీనంలోకి తీసుకుంది.

ప్రత్యేక ఆపరేషన్​ దళం, సిక్కు లైట్​ పదాతిదళాలు ఈ ఆపరేషన్​లో పాల్గొన్నట్లు తెలిసింది. ఈ పరిణామంతో పాంగాంగ్​ దక్షిణ తీర ప్రాంతంపై భారత్​ పట్టు పెంచుకునే అవకాశం ఉంది. అంతేకాదు చైనా సాయుధ బలగాలను మోహరించిన స్పంగూర్​ గ్యాప్​ ప్రాంతంపైనా నిఘా ఉంచేందుకు ఇది కీలకం కానుంది.

భారత సైన్యం ఈ ప్రాంతంలో భారీ మోహరింపులు చేస్తోంది. బీఎంపీ పదాతిదళాలు, వివిధ రకాల యుద్ధ ట్యాంకులు సహా సాయుధ దళాలను ఈ ప్రాంతానికి తరలిస్తోంది.

కాగా, భారత్ ​ ఆక్రమించిన పర్వత ప్రాంతాన్ని తమదిగా చైనా వాదిస్తోంది. అయితే దీనిపై చైనా ఎలా స్పందించినా దీటుగా బదులిచ్చేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

చరిత్రలో ఇదే ప్రథమం

పాంగోంగ్ సో సరస్సు దక్షిణ ప్రాంతంలో భారత్ వ్యూహాత్మక విజయం సాధించటం చరిత్రలో ఇదే ప్రథమం. నెహ్రూ కాలం నుంచి ఈ వివాదం నడుస్తుంది. రెండు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం అది వ్యూహాత్మక ప్రాంతంగా గుర్తించబడింది. రెండు దేశాలకు చెందిన సైన్యం అక్కడ ఉండటానికి వీల్లేదు. దీన్ని కాదని చైనా కాలు దువ్వింది. 500 మంది సైన్యంతో క్యాంప్ ఏర్పాటు చేసింది. దీన్ని పసిగట్టిన భారత్ సైన్యం.. వేగంగా స్పందించటం, దూకుడు ప్రదర్శించటంతో డ్రాగన్ తోక ముడుచుకోక తప్పలేదు.