కశ్మీర్ లో పౌర ట్రాఫిక్ పై నిషేధం..

  • Published By: veegamteam ,Published On : April 7, 2019 / 11:31 AM IST
కశ్మీర్ లో పౌర ట్రాఫిక్ పై నిషేధం..

జమ్ము కశ్మీర్ : బారాముల్లా-ఉధంపూర్ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫిబ్రవరిలో జమ్మూ-శ్రీనగర్ హైవేపై నుంచి వెళ్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌లోకి పాక్ ఉగ్రవాదులు (జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ)  ఆత్మాహుతి దాడికి పాల్పడిన  విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో భవిష్యత్‌లో మరోసారి ఇటువంటి ఘటనలు జరుగకుండా భారతీయ భద్రతా బలగాలు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి. 
 

దీంతో బారాముల్లా-ఉధంపూర్ హైవే వెంబడి..ఆదివారం, బుధవారం(ఏప్రిల్7,10)రెండు రోజుల పాటు పౌర ట్రాఫిక్‌పై నిషేధం విధించారు పోలీసులు. బారాముల్లా-ఉధంపూర్ హైవే వెంట ప్రతీ ఆదివారం, బుధవారాల్లో వీఐపీ కాన్వాయ్, భద్రతా దళాల వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఈ క్రమంలో అత్యవసర సేవల విభాగాల సిబ్బందికి ప్రత్యేక పాస్‌లను  జారీచేయనున్నారు. పౌరట్రాఫిక్ నిషేధం నేటి నుంచే షురూ కావడంతో..హైవే వెంబడి వందల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. 
 

అనంతనాగ్ జిల్లాలో ఓ పెళ్లి వేడుక కోసం ఇదే మార్గంలో వెళ్లేందుకు జిల్లా మేజిస్ట్రేట్ అనుమతితో కూడిన ట్రావెల్ పాస్ తీసుకున్నారు. పెళ్లి కోసం జిల్లా మేజిస్ట్రేట్ యంత్రాంగం 12 మంది వెళ్లేందుకు 4 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. నేను యురి ప్రాంతానికి వెళ్తున్న సమయంలో హైవేపై రాకపోకలపై నిషేధం ఆదేశాలతో ప్రజలు ఇంత అసౌకర్యానికి లోనవడం మొదటిసారి చూస్తున్నానని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.