గ్రౌండ్ జీరో : జెట్ ఎయిర్ వేస్ సర్వీసులన్నీ రద్దు

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 01:00 PM IST
గ్రౌండ్ జీరో : జెట్ ఎయిర్ వేస్ సర్వీసులన్నీ రద్దు

1990ల్లో భారతదేశ విమానయాన రంగానికి ముఖచిత్రంగా ఉన్న జెట్ ఎయిర్ వేస్ ఇప్పుడు ఒక్క విమానం కూడా నడపలేని స్థాయికి వచ్చింది..తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జెట్ సర్వీసులు నేటితో రద్దు కానున్నాయి.బుధవారం రాత్రి  నుంచి జెట్ సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.ఇన్ని రోజులు కార్యకలాపాలు ఆగిపోకుండా కాపాడుకుంటూ వచ్చినా ఆ సంస్థకు కావాల్సిన రుణాలు అందక పోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

విమానాలను నడిపించేందుకు 400కోట్ల రూపాయల ఎమర్జెన్సీ ఫండ్ ఇవ్వాలని కోరిన జెట్ సీఈవో విజయ్ దూబే విజ్ణప్తిని మంగళవారం రాత్రి రుణదాతలు తిరస్కరించినట్లు సమాచారం.అదనపు ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా ఫండ్స్ రిలీజ్ చేసేందుకు బ్యాంకులు అంగీకరించలేదు.దీంతో తప్పనిసరి పరిస్థితిల్లో జెట్ తన సేవలను ఆపేసింది.బుధవారం(ఏప్రిల్-17,2019) రాత్రి 10 గంటల 30నిమిషాలకు చివరిసారిగా జెట్ విమానం గాల్లోకి ఎగరనుంది. 

25 ఏళ్ల జెట్… 8వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది.కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు.దీంతో కొన్ని రోజులు క్రితం విధులు బహిష్కరించిన  సంస్థ సిబ్బంది  పౌర విమానయాన శాఖమంత్రి సురేశ్‌ ప్రభుకు,ప్రధాని మోడీకి తమ గోడు చెప్పుకున్నారు. జెట్ ఫౌండర్ నరేష్ గోయల్ ఆయన భార్య అనితా గోయల్ ఇటీవల జెట్ బోర్డు నుంచి కూడా తప్పుకున్నారు.అయినా కూడా పరిస్థితిలో మార్పు రాలేదు.జెట్ కు ఇప్పటికే ఐవోసీ ఫ్యూయల్ నిలిపివేసిన విషయం తెలిసిందే.

ఒకప్పుడు 100కి పైగా విమానాలతో కళకళలాడిన జెట్ సంస్థ ఇప్పుడు కుప్పకూలిపోయింది.ఇప్పటికే ఇంటర్నేషనల్ సర్వీసులను జెట్ రద్దు చేసిన విషయం తెలిసిందే.కొన్ని రోజులుగా కేవలం 5విమానాలను నడిపే స్థాయికి జెట్ దిగజారిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఏకంగా జెట్ సర్వీసులు రద్దవడం దేశీయ విమానయాన చరిత్రలో ఓ చీకటి రోజుగా మిగిలిపోనుంది. మరోవైపు జెట్ షేర్లు కుప్పకూలిపోయాయి.