Karnataka Polls: బీజేపీకి ప్రతిష్టాత్మకంగా కర్ణాటక ఎన్నికలు.. కాంగ్రెస్‌కు అసలైన సవాల్‌ అదే..

విజయమో.. వీరస్వర్గమో తేల్చుకోవాలన్న స్థాయిలో కర్ణాటకలో పోరాడుతోంది బీజేపీ. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలి అన్నదే కాషాయదళం టార్గెట్.

Karnataka Polls: బీజేపీకి ప్రతిష్టాత్మకంగా కర్ణాటక ఎన్నికలు.. కాంగ్రెస్‌కు అసలైన సవాల్‌ అదే..

Karnataka Assembly Election 2023: బీజేపీకి కర్ణాటక ఎన్నికలు ప్రెస్టేజియస్‌గా మారాయి. 45 మంది కీలక నేతలతో ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతోంది కాషాయ పార్టీ. ప్రధాని మోదీ ఒక్కరే 22 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనేలా ప్లాన్ చేసింది. హోమ్‌మంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా చెరొవైపు పర్యటిస్తున్నారు. ఈ ముప్పేటదాడిని ఎదుర్కోవడం కాంగ్రెస్‌కు సవాల్‌గా మారింది. అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంకతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కర్ణాటక నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు మాత్రమే కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు మోస్తున్నారు.

విజయమో.. వీరస్వర్గమో తేల్చుకోవాలన్న స్థాయిలో కర్ణాటకలో పోరాడుతోంది బీజేపీ. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలి అన్నదే కాషాయదళం టార్గెట్. తమ విజయ సంకల్ప యాత్ర కర్ణాటకలోనూ కొనసాగాలనే అజెండాతో ఎన్నికల బాధ్యత అంతా కేంద్ర నాయకత్వమే తీసుకుంది. ప్రధాని మోదీ కర్ణాటకపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 9 సార్లు అధికారిక పర్యటనలు చేపట్టారు ప్రధాని… ఈ నెల 29 నుంచి మే 8 రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆరు రోజుల్లో 22 ఎన్నికల ర్యాలీలు, ప్రచార సభల్లో ప్రసంగించేలా మోదీ టూర్ షెడ్యూల్ రెడీ చేసింది బీజేపీ. ఇక అమిత్‌షా ఇప్పటికే రాష్ట్రంలో తిష్టవేశారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు.

బీజేపీకి 40 మంది స్టార్ క్యాంపెయినర్లు
టీం బీజేపీ కర్ణాటక ఎన్నికల రణతంత్రాన్ని సమూలంగా మార్చేస్తోంది. 45 మంది కీలక నాయకులతో బీజేపీ ఎన్నికల బృందం కర్ణాటకలో మోహరించింది. స్టార్‌ క్యాంపెయినర్లు(star campaigners)గా కొందరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండగా, మిగిలిన వారు వారికి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తూ వెనకుండి నడిపిస్తున్నారు. స్థానిక నాయకులతో కలిపి 40 మంది స్టార్ క్యాంపెయినర్లను నియమించినా ప్రధాని మోదీ, హోమ్‌మంత్రి అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. సున్నితమైన అంశాలను కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ వైఖరిని నిలదీస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. 60 ఏళ్ల జాతీయ పార్టీ ఏం చేసిందో చెప్పాలని అమిత్‌షా సంధిస్తున్న ప్రశ్నలు ఓటర్లను ఆలోచనలో పడేస్తున్నాయని చెబుతున్నారు పరిశీలకులు.

Mallikarjun Kharge
ఖర్గేకి ప్రతిష్టాత్మకం

అవినీతి ఆరోపణలపై బీజేపీని ఇరుకున పెట్టాలని చూసిన కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ, హోమ్‌మంత్రి అమిత్‌షా ఊహించని రీతిలో షాక్ ఇస్తున్నారు. ఎన్నికలు జరగకముందే కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ (dk shivakumar) సీఎం కుర్చీ కోసం కుస్తీ పడుతున్నారని విమర్శిస్తోంది బీజేపీ. అయితే కాషాయ నేతల విమర్శలను సమర్థంగా తిప్పికొడుతోంది కాంగ్రెస్. బీజేపీ అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకుని కమలం పార్టీకి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ముఖ్యంగా స్థానికుడైన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇదేసమయంలో అగ్రనేతలు రాహుల్, ప్రియాంక కూడా కన్నడ నాట విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న కాంగ్రెస్ చావోరేవో తేల్చుకోవాలన్న రీతిలో పోరాడుతోంది.

Also Read: నా కూతురి వల్లే రిషి సునక్ ప్రధాని కాగలిగాడు.. సుధామూర్తి కామెంట్స్ వైరల్

బీజేపీకి దీటుగా కాంగ్రెస్ క్యాంపెయిన్
బీజేపీపై అవినీతి ఆరోపణలు చేయడమొక్కటే కాదు.. ప్రజలను ఇబ్బంది పెడుతున్న చిన్న చిన్న సమస్యలను ప్రస్తావిస్తూ క్షేత్రస్థాయిలో.. ప్రతి ఓటరును ఆకట్టుకునేలా ప్రచారం చేస్తోంది కాంగ్రెస్. జీఎస్‌టీ రూపంలో పెద్దపెద్ద వ్యాపారులకు లబ్ధి జరిగేలా బీజేపీ చట్టం తీసుకువచ్చిందని ఆరోపిస్తున్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). కాంగ్రెస్ గెలిస్తే చిన్న వ్యాపారులకు మేలు జరిగేలా ఒకే పన్ను చట్టం.. సులభమైన పన్ను విధానం తీసుకువస్తామని చెబుతున్నారు. అదేసమయంలో బీజేపీ విమర్శలను తిప్పికొడుతోంది. కాంగ్రెస్ గెలిస్తే అల్లర్లు జరుగుతాయని బెళగావి సభలో అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. అదే సమయంలో కాంగ్రెస్ అంటే అవినీతి అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపైనా తీవ్రస్థాయిలో స్పందించారు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే. ప్రధాని మోదీని విషసర్పమని ఖర్గే చేసిన విమర్శలతో హీట్ పెరిగిపోయింది.

పోటాపోటీగా ప్రచారం
ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పోటాపోటీగా.. దేనికైనా రెడీ అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికలు కన్నడసీమలో జరుగుతున్నా.. ప్రచారం మొత్తం ఢిల్లీ నేతల కనుసన్నల్లో జరుగుతోంది. దీంతో సార్వత్రిక ఎన్నికల సందడిగా మారిపోయింది కర్ణాటక పోరు. పూర్తిగా బలహీనపడిపోయిందనుకున్న కాంగ్రెస్ పడిలేచిన కెరటంలా కర్ణాటకలో పుంజుకోవడంతో కాషాయ దళపతులకు దిమ్మదిరిగిపోతోంది. ఎట్టిపరిస్థితుల్లో కర్ణాటక చేజారకూడదనే లక్ష్యంతో ప్రధాని మోదీతో సహా కీలక నేతలంతా క్షేత్రస్థాయిలో తిరుగుతున్న నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్ కూడా బీజేపీకి దీటుగా కదులుతూ విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తోంది. రానున్న రెండు వారాలు కీలకం కావడంతో ప్రధాన పార్టీల నేతలు మొత్తం కర్ణాటకలోనే తిష్టవేస్తున్నారు.