Mamata Banerjee : చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా..బెంగాల్ పోలింగ్ కుదించండి

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా రోజుకు 2లక్షల కేసులు నమోదవుతున్నాయి.

Mamata Banerjee : చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా..బెంగాల్ పోలింగ్ కుదించండి

Mamata Banerjee Urges Ec With Folded Hands To Curtail Bengal Poll Schedule Amid Covid 19 Surge

Mamata Banerjee దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా రోజుకు 2లక్షల కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం అందరిలో టెన్షన్ పుట్టిస్తోంది.

బెంగాల్ లో కరోనా కేసులు ఉద్ధృతమవుతున్న వేళ..బెంగాల్​లో ఎన్నికల షెడ్యూల్​ కుదించాలని ఈసీని కోరారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తదుపరి మూడు దశల్లో నిర్వహించాల్సిన పోలింగ్​ను ఒక్కరోజులో ముగించాలని మమతా బెనర్జీ ఎన్నికల సంఘాన్ని కోరారు. కాగా,వెస్ట్ బెంగాల్ లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గానూ.. ఇప్పటికే ఐదు విడతల్లో 180 నియోజకవర్గాలకు పోలింగ్​ జరిగింది. మిగిలిన 114 సీట్లకు మూడు దశల్లో ఏప్రిల్ 22 నుంచి 29 వరకు ఎన్నికలు జరగనున్నాయి.

సోమవారం దినాజ్​పుర్​ ఎన్నికల ప్రచారం సందర్భంగా మమత మాట్లాడుతూ…చేతులు జోడించి ఎన్నికల సంఘాన్ని అభ్యర్థిస్తున్నా. రాష్ట్రంలో జరిగే మిగిలిన మూడు దశల పోలింగ్​ను ఒకే దఫాలో నిర్వహించండి. అలా కానిపక్షంలో కనీసం రెండు రోజులకు కుదించే ఏర్పాటు చేయాలని కోరారు. బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవద్దంటూ ఈసీని కోరారు మమతాబెనర్జీ. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఈసీ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని దీదీ సూచించారు. ఇక, రాష్ట్రంలో కొవిడ్​ను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేసినట్టు మమత తెలిపారు. కరోనా పరిస్థితులపై ప్రజలు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైరస్​ను కట్టడిచేసేందుకు రాత్రి కర్ఫ్యూ ఒక్కటే పరిష్కారం కాదన్న ఆమె.. హాస్పిటల్స్ లో కరోనా పేషెంట్ల కోసం పడకల్ని పెంచడం సహా ఇతర సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

మరోవైపు, కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ కోల్‌కతాలో ఇకపై ప్రచారం చేయరని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు, ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ఆదివారం రాత్రి ట్వీట్‌ చేశారు. స్పష్టంచేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ప్రచారం చివరి రోజు ఏప్రిల్ 26న కోల్‌కతా నగరంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఒక సాధారణ సమావేశాన్ని మాత్రమే నిర్వహిస్తారని ఓబ్రెయిన్ పేర్కొన్నారు. అయితే.. ఎన్నికలు జరిగే జిల్లాల్లో నిర్వహించే ప్రచార సభలను కూడా 30 నిమిషాలకే పరిమితం చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. కోవిడ్ -19 కేసుల పెరుగుదల కారణంగా పశ్చిమ బెంగాల్‌ ప్రచారాన్ని విరమించుకుంటున్నట్లు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం వెల్లడించారు. కోవిడ్ దృష్ట్యా ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. అనంతరం మమతా ఈ నిర్ణయం తీసుకుంటూ ప్రకటించారు.