బిడ్డ శవం పూడ్చటానికి వెళ్తే గోతిలో ప్రాణాలతో పసికందు

బిడ్డ శవం పూడ్చటానికి వెళ్తే గోతిలో ప్రాణాలతో పసికందు

అంతా అయిపోయిందనుకున్న వేళ.. విధి మరోలా కలిసొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన దంపతుల కన్నీళ్లకు అడ్డుకట్ట పడేలా చేసింది. కన్నబిడ్డ చనిపోయిందనే దిగులుతో పూడ్చిపెట్టేందుకు వెళ్లిన ఆ తండ్రికి మూడు అడుగుల లోతులో మట్టి కుండలో కనిపించిన పసికందు కడుపు శోకాన్ని తీర్చింది.

బరేలీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్.. అభినందన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. హితేశ్ కుమార్ సిరోహి, వైశాలి దంపతులు బుధవారం హాస్పిటల్ కు వచ్చారు. భార్యకు కడుపులో నొప్పులు వస్తున్నాయని హాస్పిటల్ కు తీసుకువచ్చాడు. ఏడు నెలల గర్భిణీ అయిన వైశాలి ఓ పాపను ప్రసవించింది. ఆరోగ్య కారణాలతో పుట్టిన కొద్ది క్షణాల్లోనే మృతి చెందింది. 

గురువారం ఆ పాపను పూడ్చి పెట్టేందుకు హితేశ్ మట్టిని తవ్వాడు. మూడు అడుగుల లోతులో ఓ మట్టి కుండ కనిపించింది. దాన్ని తీసి చూసేసరికి అందులో ఓ పాప ఉంది. దూది సహాయంతో పాపకు పాలు పట్టించి ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో జిల్లా హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. 

ప్రస్తుతం పాప సురక్షితంగా ఉందని.. బిడ్డ తల్లి గురించి వివరాల కోసం వెదుకుతున్నామని పోలీసులు తెలిపారు. సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శైలేంద్ర పాండే పాపను సజీవంగా పాతిపెట్టిన వాళ్ల గురించి ఆరా తీస్తున్నామని తెలిపారు.