Giloy Liver : తిప్పతీగ వాడితే కాలేయం దెబ్బతింటుందా? వాస్తవం ఏంటో చెప్పిన ఆయుష్ మంత్రిత్వ శాఖ

తిప్పతీగ ఆరోగ్యానికి మంచిది కాదా? తిప్పతీగ వాడితే లివర్ డ్యామేజ్ అవుతుందా? అసలు ఇందులో వాస్తవం ఎంత? నిపుణులు ఏమంటున్నారు?

Giloy Liver : తిప్పతీగ వాడితే కాలేయం దెబ్బతింటుందా? వాస్తవం ఏంటో చెప్పిన ఆయుష్ మంత్రిత్వ శాఖ

Giloy Liver

Giloy Liver : తిప్పతీగ.. పల్లెల్లో ఎక్కువగా చూస్తుంటాం. పట్టణ శివార్లలోనూ, రోడ్ల పక్కన పొదల్లో కనిపిస్తూ ఉంటుంది. తిప్పతీగను అమృత, గుడూచి అని కూడా అంటారు. తిప్పతీగను చాలామంది ఏదో పనికిరానిదిగా అనుకుంటారు. కానీ, తమలపాకు రూపంలో చిన్నగా ఉండే ఈ ఆకులో విశేషమైన వైద్య గుణాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం చాలామందికి తెలిసిఉండదని అంటున్నారు.

అలాంటి తిప్పతీగ గురించి ఓ జర్నల్ లో వచ్చిన అధ్యయనం చర్చకు దారితీసింది. ఆ అధ్యయనం విస్మయానికి గురి చేసింది. తిప్పతీగ వాడడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది అంటూ జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ హెపటాలజీలో ఓ అధ్యయనం ప్రచురించారు. దాని ఆధారంగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆ వార్తలను ఆయుష్ శాఖ ఖండించింది.

తిప్పతీగ వాడడం వల్ల కాలేయానికి ఎటువంటి సమస్య ఉండదని ఆయుష్ మంత్రిత్వశాఖ తేల్చి చెప్పింది. తిప్పతీగ వాడడం వల్ల ముంబైలో ఆరుగురు రోగుల కాలేయాలు దెబ్బ తిన్నాయంటూ సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ వార్తలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని అంది. తిప్పతీగ వల్ల కాలేయం దెబ్బతిన్నదనడానికి సరైన ఆధారాలు లేకుండా ప్రచురించారని పేర్కొంది. ఆ అధ్యయనం, వార్తలు నిరాధారం అని స్పష్టం చేసింది.

అంతేకాదు తిప్పతీగ లాంటి మూలికలు కాలేయం సక్రమంగా పనిచేయడంలో దోహదం చేస్తాయని గతంలో జరిగిన పరిశోధనలు వెల్లడించాయని ఆయుష్ మంత్రిత్వశాఖ గుర్తు చేసింది. కేవలం తిప్పతీగపై మాత్రమే ఈ అంశంపై 169కి పైగా పరిశోధనలు జరిగాయని ఇవన్నీ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని ఆయుష్ శాఖ వివరించింది. టి.కార్డిఫోలియా సమర్థతపై 871కి పైగా వివరాలను పొందవచ్చని ఆయుష్ శాఖ పేర్కొంది. ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగించే తిప్పతీగపై వందలాది పరిశోధనలు జరిగాయని తెలిపింది. కాలేయం సక్రమంగా పనిచేసేలా చూసే గుణాలను తిప్ప తీగ కలిగుందని దీని వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

తిప్పతీగ వినియోగంపై నిర్వహించిన అధ్యయనాలు సరైన పద్ధతిలో జరగలేదని ఆయుష్ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఫలితాలను కూడా క్రమపద్ధతిలో పొందుపరచలేదని అంది. ఎంతోకాలం నుంచి ఆయర్వేద వైద్య విధానంలో తిప్పతీగను వినియోగిస్తున్నారని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాలేయాన్ని తిప్పతీగ దెబ్బ తీస్తుందని జరుగుతున్న ప్రచారం సంప్రదాయ భారతీయ వైద్య విధానంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని ఆయుష్ మంత్రిత్వ శాఖ చెప్పింది.

ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల్లో తిప్పతీగ గురించి తెలుసుకోవాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. తిప్పతీగ ఆకులను బాగా నూరి గోలీకాయ అంత ఉండలు చేసి 10 రోజుల పాటు ఉదయం, సాయంత్రం తీసుకుంటే రోగనిరోధకశక్తి బాగా పెరుగుతుందని ఆయుర్వేద డాక్టర్లు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఈ ఔషధాన్ని తీసుకుంటే జ్వరం కూడా రాదని, వచ్చినా త్వరగా తగ్గిపోతుందని అంటున్నారు. ఆయుర్వేద శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం తిప్పతీగ ఆకులను ‘శంశమినివటి’ అనే పేరుతో మందులుగా తయారుచేసి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరిస్తున్నారు.

తిప్పతీగ ఆకుల్లోనే కాదు.. కాడల్లోనూ వైద్య గుణాలు ఉన్నాయని అంటున్నారు. కిడ్నీ సంబంధ జబ్బులు, మధుమేహంతోపాటు అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉపయోగించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఈ తిప్పతీగకు మరణం ఉండదు. వేర్లు తెంచేసినా పైనున్న తీగలు అల్లుకుంటూనే ఉంటాయి. చెట్లు, గోడలు, విద్యుత్‌ తీగలు సహా ఎక్కడైనా పాకుతూ పోతూ ఉంటుంది.