ప్రాపర్టీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోడీ…దళారీల కోసమే అగ్రి చట్టాలపై విపక్షాల రగడ

  • Published By: venkaiahnaidu ,Published On : October 11, 2020 / 03:01 PM IST
ప్రాపర్టీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోడీ…దళారీల కోసమే అగ్రి చట్టాలపై విపక్షాల రగడ

PM Modi launchesproperty cards గ్రామాల్లో భూములకు యాజమాన్య హక్కులు కల్పించి వాటి ద్వారా రుణాలు, ఇతర ప్రయోజనాలను అందించేందుకు వీలుగా రూపొందించిన గ్రామీణ ప్రాపర్టీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ(అక్టోబర్-11,2020) ప్రధాని మోడీ ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన స్వామిత్వ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ప్రాపర్టీ కార్డులను అందజేసే కార్యక్రమాన్ని దేశంలోని ఆరు రాష్ట్రాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రారంభించారు.



దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివ‌సిస్తోన్న కోట్లాది మంది పౌరులకు ఈ పథకం ద్వారా సాధికార‌త క‌ల్పించనుంది కేంద్రం. గ్రామస్థులు వారి భూములను ఆర్థిక ఆస్తులుగా పరిగణించి రుణాలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు మార్గం సుగమం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా సుమారు ల‌క్ష మంది లబ్ధిదారులు వారి ప్రాపర్టీ కార్డుల‌ను ఎస్ఎమ్ఎస్ లింక్ ద్వారా డౌన్​లోడ్ చేసుకొనేందుకు అవ‌కాశం ల‌భించ‌నుంది. అనంతరం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాపర్టీ కార్డుల‌ను ద‌స్తావేజుల రూపంలో అంద‌జేస్తాయి. ఈ ప‌థ‌కం ల‌బ్ధిదారుల్లో ఆరు రాష్ట్రాల‌లోని 763 గ్రామాల ప్రజలు ఉన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ… హర్యానా,కర్ణాటక,మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోని 1లక్ష మంది లబ్దిదారులకు ఇవాళ తమ ఇళ్లకు సంబంధించిన లీగల్ పేపర్లు అందుకోనున్నారని మోడీ తెలిపారు. ఇద్దరు గొప్ప నాయకులు జయ్ ప్రకాష్ నారాయణ్,నానాజీ దేశ్ ముఖ్ ల జయంతి రోజైన ఇవాళ ప్రాపర్టీ కార్డుల పంపిణీ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. నానాజీ,జయ్ ప్రకాష్ ఇద్దరూ తమ జీవితమంతా గ్రామీణ భారతం,పేదవాళ్ల సాధికారత కోసం పోరాడారని గుర్తు చేశారు.



ప్రాపర్టీ కార్డు అనేది గ్రామస్తులకు ఎలాంటి వివాదం లేకుండా ఆస్తి కొనుగోలు మరియు అమ్మకం మార్గాన్ని క్లియర్ చేస్తుందని మోడీ తెలిపారు. మన దేశంలోని గ్రామాల్లో చాలా మంది యువకులు ఉన్నారు, వారు స్వయంగా ఏదైనా చేయాలనుకుంటున్నారు. ప్రాపర్టీ కార్డు పొందిన తరువాత, వారి ఇళ్లపై బ్యాంకుల నుండి రుణాలు సులభంగా పొందవచ్చు. మ్యాపింగ్ మరియు సర్వేలో డ్రోన్‌లను ఉపయోగించడం వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో, ప్రతి గ్రామానికి సంబంధించిన ఖచ్చితమైన భూ రికార్డులను సృష్టించవచ్చని మోడీ అన్నారు. ఖచ్చితమైన భూ రికార్డుల కారణంగా, గ్రామంలో అభివృద్ధికి సంబంధించిన పనులు కూడా తేలికగా ఉంటాయి.. ఇది ఈ ప్రాపర్టీ కార్డుల యొక్క మరొక ప్రయోజనం అని మోడీ తెలిపారు. రాబోయే 3-4సంవత్సరాలలో ఈ విధమైన ప్రాపర్టీ కార్డులను దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లోని ప్రతి ఒక్క ఇంటికీ ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు.


ఈ సందర్భంగా విపక్షాలపై మోడీ విమర్శలు గుప్పించారు. గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం గత ఆరేళ్లుగా ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. దీన్ని చూసి ఓర్వలేకే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దశాబ్దాల కాలం పాటు దేశాన్ని పాలించిన వారు గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించలేకపోయారని విమర్శించారు. దేశంలోని రైతుల శ్రేయస్సు కోసం కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మధ్యవర్తులు, దళారీల కోసం పనిచేసే రాజకీయ శక్తులే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయన్నారు. వ్యవసాయ సంస్కరణలపై విపక్ష నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.