ముంబైకి సెలవు : కుండపోత వర్షంపై హై అలర్ట్

  • Published By: veegamteam ,Published On : September 4, 2019 / 06:27 AM IST
ముంబైకి సెలవు : కుండపోత వర్షంపై హై అలర్ట్

ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు ముంబైని ముంచెత్తాయి. జనజీవనం స్థంభించింది. వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. భారీ వర్షాల కారణంగా ముంబైకి సెలవు ప్రకటించారు. బుధవారం(సెప్టెంబర్ 4,2019) స్కూల్స్ కి హాలీడే ఇచ్చారు. రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

మంగళవారం(సెప్టెంబర్ 3, 2019) రాత్రి భారీ వర్షం పడింది. వీధుల్లోకి వరద నీరు పోటెత్తింది. నగరంలోని సియాన్, పరేల్, దాదర్, బైకుల్లా ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. బుధవారం(సెప్టెంబర్ 4) కూడా భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై, థానే నగరాలకు అరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ హెచ్చరికలతో ముంబైలోని స్కూల్స్ కి సెలవు ప్రకటించారు. ముంబై వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఒక వేళ పిల్లలు ఇప్పటికే స్కూల్ కి చేరుకుని ఉంటే వారిని సురక్షితంగా ఇంటికి పంపాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్స్ దే అని బీఎంసీ ట్వీట్ చేసింది. నీరు నిలిచిన ప్రదేశాలు, సముద్రం దగ్గర వాకింగ్ చేయకూడదాని, దూరంగా ఉండాలని ప్రజలకు బీఎంసీ హెచ్చరించింది. సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1916 ఏర్పాటు చేసింది. టేక్ కేర్ ముంబై.. అంటూ బీఎంసీ ట్వీట్ చేసింది. సబ్బరన్ రైల్వే సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని చోట్ల ట్రాక్ లు దెబ్బతిన్నాయి. దీంతో లోకల్ రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి.