స్నేహానికి మతం అడ్డుకాదు : పాడె మోసి.. తలకొరివి పెట్టిన ముస్లిం సోదరులు

స్నేహానికి మతం అడ్డుకాదు : పాడె మోసి.. తలకొరివి పెట్టిన ముస్లిం సోదరులు

మతాన్ని గెలిచింది మానవత్వం.. శవం దగ్గర పంచాయితీలు పెడుతున్న రోజుల్లో ముస్లిం సోదరులు హిందూ అంకుల్ పాడె మోశారు. అంతేకాదు హిందూ సంప్రదాయం ప్రకారం.. అంతిమ యాత్రలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. మరో కోణంలో చూస్తే వృద్ధులైన పేరెంట్స్‌నే పట్టించుకోకుండా ఉంటున్న నేటి జనరేషన్‌కు కనువిప్పుగా ఉంది. నలబై ఏళ్ల పాటు తండ్రికి బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్న హిందూ అంకుల్ అంతిమ యాత్రలో ముస్లింసోదరులు పాల్గొన్నారు. 

భానుశంకర్ పాండ్యా.. గుజరాత్‌లోని ఆమ్రేలి జిల్లాలో శవర్‌కుండ్లా పట్టణంలో నివాసముంటుంది. సోదరులైన అబు, నజీర్, జుబేర్ ఖురేశీ దినసరి కూలీలుగా జీవనం సాగిస్తూ ఇస్లాం పద్ధతి తూచా తప్పకుండా పాటిస్తున్నారు. కానీ, పాండ్యా అంతిమ యాత్ర విషయానికొచ్చేసరికి ధోతీ కట్టుకుని జంధ్యం వేసుకోవడానికి కూడా వెనుకాడలేదు. 

‘భానుశంకర్ అంకుల్ పాడెపై ఉన్నప్పుడు హిందూ కుటుంబం నుంచి గంగాజలం తీసుకొచ్చాం. అతను కాలం చేశాక వారి బంధువులకు అంత్యక్రియలు మేమే చేస్తామని ఆ బ్రాహ్మణ కుటుంబానికి తెలియజేశాం. వాళ్లు పాడె మోయాలి అన్నప్పుడు దానికి మేం సరేనని చెప్పాం’ అని వాళ్లలో పెద్దవాడైన జుబేర్ అన్నాడు. 

భానుశంకర్ అంకుల్‌కు కుటుంబం లేదు. అతని కాలికి గాయం కావడంతో చాలా ఏళ్ల క్రితమే అతణ్ని మా దగ్గరకు వచ్చేయమని మా తండ్రి చెప్పారు. అప్పటి నుంచి అతను మా కుటుంబంలో ఒకరైపోయాడు. మా పిల్లలంతా అతణ్ని తాతా అని పిలిచేవారు. మా భార్యలు అతని కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకునేవారు. పండుగ రోజుల్లో మనస్ఫూర్తిగా మాతోపాటు సెలబ్రేట్ చేసుకునేవారు. ఆయన కోసం ప్రత్యేకంగా పూర్తి వెజిటేరియన్ ఆహారం తయారుచేసి ఇచ్చేవాళ్లం’ అని అబు తెలిపాడు. 

40ఏళ్లుగా భిఖు ఖురేశీ.. పాండ్యాలు స్నేహితులుగా ఉంటున్నారు. మూడేళ్ల క్రితం ఖురేశీ చనిపోయాడు. ఆ బాధతో పాండ్యా కుంగిపోయాడు. ఈ కుటుంబాల మధ్య స్నేహా బంధాన్ని పరాగ్ త్రివేది, ఆమ్రేలి జిల్లా బ్రహ్మ సమాజ్ ప్రశంసించింది. భానుశంకర్ అంతిమ యాత్రను హిందూ సంప్రదాయంలో నిర్వహించి.. అబు, నజీర్, జుబేర్‌లు జాతుల మధ్య బంధాలు బలపడేలా చేశారని అభినందించారు.