TRP,OTPలకు నిబంధనలు రెడీ..అతి త్వరలోనే అమల్లోకి : ప్రకాష్ జావదేకర్

TRP,OTPలకు నిబంధనలు రెడీ..అతి త్వరలోనే అమల్లోకి : ప్రకాష్ జావదేకర్

TRP, OTT ఓటీటీ(OTT) ఫ్లాట్ ఫామ్స్ కి సంబంధించి గైడ్ లైన్స్ ను అతి తర్వలోనే విడుదల చేస్తామని ఇవాళ లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంలో భాగంగా కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. ఓటీటీల విషయంలో తమకు చాలా సలహాలు,అదేవిధంగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. నిబంధనలు,సూచనలు దాదాపుగా పూర్తయ్యాయని..త్వరలోనే వాటిని అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. అదేవిధంగా టీఆర్పీ(టెలివిజన్ రేటింగ్ పాయింట్స్)కి సంబంధించి కూడా కొత్త గైడ్ లైన్స్ ను తీసుకురానున్నట్లు జావదేకర్ చెప్పారు.

ఓటీటీ డిజిటల్ కంటెంట్ కి సంబంధించి స్వీయ-నియంత్రణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(IAMAI)తమ మంత్రిత్వ శాఖకు ఇచ్చిన హామీలు..చట్టం ప్రకారం నిషేధించబడిన కంటెంట్‌కు తగిన అవగాహన ఇవ్వలేదని మరియు ప్రయోజన వివాద సమస్యలు ఉన్నాయని జవదేకర్ చెప్పారు. తరుచుగా ఫిర్యాదుల వస్తోన్న నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్ పామ్స్ మరియు IAMAIతో సమాచార,ప్రసార మంత్రిత్వశాఖ పలుసార్లు చర్చించినట్లు తెలిపారు.

కాగా, ప్రెస్‌ కౌన్సిల్‌, కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌ (నియంత్రణ) చట్టం, సెన్సార్‌ బోర్డు వంటి వాటి పరిధిలో ఓటీటీలు లేకపోవడంతో అశ్లీలత, హింస, మతపరమైన అంశాల విషయంలో కొన్ని సిరీయల్స్,సినిమాలపై పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని..అందుకే త్వరలోనే ఓటీటీ వేదికలకు సంబంధించిన మార్గదర్శకాలు తీసుకొస్తామని ఆయన చెప్పారు. ఇటీవల హిందూ దేవుళ్లను అవమానించేలా ఉందంటూ ‘తాండవ్‌’ వెబ్‌సిరీస్‌పై ఫిర్యాదులు వచ్చిన వేళ కేంద్రమంత్రి ఈ ప్రకటన చేశారు.

అయితే, గతేడాది నవంబర్ లోనే..ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ని అదేవిధంగా ఆన్ లైన్ ఫాట్ ఫామ్స్ లోని న్యూస్ మరియు కరెంట్ ఎఫైర్స్ కంటెంట్ ని సమాచార,ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోకి కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అలాగే పాలసీలను నియంత్రించే అధికారాలను కూడా సమాచార,ప్రసార మంత్రిత్వశాఖకు కల్పించింది.

కాగా, ప్రస్తుతం ఓటీటీల కాలం నడుస్తోంది. అనేక కొత్త చిత్రాలు ఓటీటీలోనే విడుదలవుతూ కోట్లాది రూపాయల మేరకు వ్యాపారం చేస్తున్నాయి. అదేసమయంలో అసభ్యకరమైన రీతిలో వెబ్‌సిరీస్‌లు కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. వీటిపై అనేక రకాలైన ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఓటీటీలకు గైడ్ లైన్స్ తీసుకొస్తామని చేసిన ప్రకటన ఇప్పుడు కీలకంగా మారింది.