యాక్టివ్ కేసులకన్నా వ్యాక్సిన్ తీసుకున్నవారే అధికం : ఆరోగ్యశాఖ

యాక్టివ్ కేసులకన్నా వ్యాక్సిన్ తీసుకున్నవారే అధికం : ఆరోగ్యశాఖ

Health Ministry దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 4,54,049 మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించినట్లు మంగళవారం(జనవరి-19,2021) కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 2,23,669 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య.. యాక్టివ్ కేసులతో పోలిస్తే రెట్టింపు ఉందని తెలిపింది.

వ్యాక్సిన్ ప్రతికూల ప్రభావాలపై ఇప్పటివరకు ఎలాంటి తీవ్రమైన కేసులు నమోదు కాలేదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. రెండు వ్యాక్సిన్లు(కోవిషీల్డ్,కోవాగ్జిన్) అత్యంత సురక్షితంగా పనిచేస్తున్నాయన్నారు. ఇప్పటివరకు వ్యాక్సిన్ స్వీకరించినవారిలో 0.18 శాతం మందిలో మాత్రమే ప్రతికూల ప్రభావాలు తలెత్తాయని.. 0.002 శాతం మందికి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ అవసరమైందని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ అని చెప్పారు.

మరోవైపు, దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని కేంద్ర వైద్య శాఖ తెలిపింది. రోజువారీ కేసులు అతి తక్కువ స్థాయికి పడిపోయాయని తెలిపింది. మంగళవారం 10,064 కరోనా కేసులు నమోదయ్యాయని… ఇది ఏడు నెలల కనిష్ఠమని తెలిపింది. కొత్త కేసుల్లో 71 శాతం ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచే ఉన్నాయని పేర్కొంది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో తీవ్రత అధికంగా ఉందని తెలిపింది. ఇక, దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు పరిమితమైందని..మొత్తం కేసుల్లో ఇది 1.90 శాతం మాత్రమేనని తెలిపింది. ఇక, దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య 141కి చేరినట్లు తెలిపింది.