Omicron Covid Variant : మహారాష్ట్రలో ఒమిక్రాన్ అలర్ట్.. భారత్‌లో పెరుగుతున్న కేసులు..!

భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) నెమ్మదిగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కోవిడ్ కేసులు చాపకింద నీరులా పెరిగిపోతున్నాయి.

Omicron Covid Variant : మహారాష్ట్రలో ఒమిక్రాన్ అలర్ట్.. భారత్‌లో పెరుగుతున్న కేసులు..!

Omicron Covid Variant Toddler Among 9 New Omicron Cases In India; Tally Up At 32

Omicron Covid Variant : భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) నెమ్మదిగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ ఒమిక్రాన్ కోవిడ్ కేసుల సంఖ్య 32కు చేరింది. శుక్రవారం (డిసెంబర్ 11) ఒక్కరోజే మహారాష్ట్రలో ఏడు కేసులు నమోదయ్యాయి. మూడున్నరేళ్ల చిన్నారి సహా ఏడుగురికి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించినట్టు నిర్థారణ అయింది. ఇదివరకే టాంజానియా నుంచి ముంబైకి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టుగా మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

జింబాబ్వే నుంచి వచ్చిన ఎన్నారైలో కూడా ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. ఆయన భార్య, బావమరిదికి కూడా ఈ కొత్త వేరియంట్‌ సోకినట్టు నిర్ధారణ అయిందని జామ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పేర్కొంది. దాంతో గుజరాత్‌ రాష్ట్రంలో మొత్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 3కి చేరింది. ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయినవారందరి శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం గాంధీనగర్‌లోని గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చి సెంటర్‌కు తరలించారు.

గురుగోవింద్‌ సింగ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఒమిక్రాన్‌ వార్డుకు ఒమిక్రాన్ బాధితులను తరలించారు. దేశంలో మొత్తంగా మహారాష్ట్రలో 17 ఒమిక్రాన్ కేసులు, రాజస్థాన్ లో 9 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. గుజరాత్ 3, కర్ణాటక 2, దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 8,503 కరోనా కేసులు న‌మోద‌య్యాయి.

గురువారంతో పోలిస్తే.. కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 3,46,74,744కు చేరింది. కొత్త‌గా 7,678 మంది కరోనా నుంచి కోలుకున్నారు. క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య మొత్తం 3,41,05,066కు చేరింది. కొవిడ్ యాక్టివ్ కేసులు తగ్గాయి. ప్ర‌స్తుతం 94,943 యాక్టివ్ క‌రోనా కేసులు మాత్రమే ఉన్నాయి. గ‌త 24 గంట‌ల్లో క‌రోనాతో 634 మంది ప్రాణాలు కోల్పోగా.. కేర‌ళ‌లో 225 మంది మ‌ర‌ణించార‌ు.

దేశంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 4,74,735కు చేరింది. ఇక మ‌ర‌ణాల రేటు 1.35 శాతంగా నమోదైంది. క‌రోనా రిక‌వ‌రీ రేటు 98.4 శాతంగా ఉంది. క‌రోనా కొత్త వేరియంట్ల వ్యాప్తితో కోవిడ్-19 టెస్టులు మాత్రమే కాదు.. వ్యాక్సినేష‌న్ లోనూ అధికారులు వేగం పెంచారు. దేశంలో మొత్తంగా 65,19,50,127 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించినట్టు భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి వెల్ల‌డించింది.

Read Also : Comet Leonard : డిసెంబర్ 12న ఆకాశంలో అద్భుతం.. 70వేల ఏళ్ల తర్వాత కనిపించనున్న ఆ గ్రీన్‌ కలర్‌ తోకచుక్క చూడాలంటే?