కోల్ కతా గులాబీ మయం : పింక్ బాల్ టెస్టు టికెట్లు సోల్డ్ అవుట్

  • Published By: madhu ,Published On : November 20, 2019 / 06:42 AM IST
కోల్ కతా గులాబీ మయం : పింక్ బాల్ టెస్టు టికెట్లు సోల్డ్ అవుట్

తొలిసారి భారత్‌ ఆతిథ్యమిస్తున్న చారిత్రాత్మక డే అండ్‌ నైట్‌ టెస్టుకు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పింక్‌బాల్‌ టెస్టు టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. టిక్కెట్లన్నీ అమ్ముడైనట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపాడు. తొలి నాలుగు రోజులకు ఈడెన్‌లో స్టాండ్స్‌ అన్నీ ఫుల్‌ అయ్యాయని తెలిపారు. ఇందుకు చాలా సంతోషంగా ఉందని గంగూలీ అన్నారు. భారత్‌లోని అతిపెద్ద స్టేడియాల్లో ఒకటైన ఈడెన్‌ గార్డెన్స్‌ సీటింగ్‌ కెపాసిటీ మొత్తం 67వేలు. ఈ సీటన్నీ నాలుగు రోజులకు నిండిపోయాయి. ఐదో రోజు ఆటకు సంబంధించిన టిక్కెట్లు ఇంకా విక్రయించలేదు. 

ఈడెన్‌ గార్డెన్స్‌లో నవంబర్ 22వ తేదీ నుంచి భారత జట్టు ఆడబోయే చరిత్రాత్మక తొలి డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌పైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. బంగ్లాదేశ్‌తో జరిగే ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే కోల్‌కతా వీధులన్నీ గులాబీమయమయ్యాయి. ఎక్కడ చూసినా పింక్‌ లైట్లు దర్శనమిస్తున్నాయి. అంతేకాదు… ఈడెన్‌ గార్డెన్‌నూ పింక్‌మయం చేసేశారు.  స్టేడియం, స్టాండ్స్‌ అన్నీ  పూర్తిగా పింక్‌ బల్బులతో అలంకరించారు. ఇప్పటికే మీరట్ ఎస్జీ ఫ్యాక్టరీ 120 గులాబీ బంతులను ప్రాక్టీస్ కోసం తయారు చేసి ఇచ్చింది. మ్యాచ్ జరిగే సమయానికి మరో వంద బంతులు అందుబాటులో ఉంచనుంది ఎస్జీ ఫ్యాక్టరీ.

బంగ్లా టీమ్‌తో ఫస్ట్ టెస్ట్‌ని మూడంటే మూడే రోజుల్లో ముగించేసిన టీమిండియా ముందు ఇప్పుడు పింక్ టెస్ట్ పెద్ద సవాలుగా నిలిచింది. గతంలో ఎప్పుడూ గులాబీ బంతిని టీమిండియా ఎదుర్కోలేదు. కోల్‌కతాకి పయనమయ్యేముందు టీమిండియా ఇండోర్ స్టేడియంలో విపరీతంగా ప్రాక్టీస్ చేసింది. రెండు టెస్టులకు మధ్య గ్యాప్ తక్కువ ఉండటంతో ఫస్ట్ టెస్ట్‌కి ముందే పింక్‌బాల్‌తో నెట్ ప్రాక్టీస్ చేయడమే మనోళ్లు ఈ మ్యాచ్‌ని ఎంత సవాలుగా తీసుకుంటుందీ అర్ధమవుతోంది. 

టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియాకి..బంగ్లాదేశ్‌కి ఇదో హిస్టారికల్ మూమెంట్. అందుకే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా..పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో పాటు..ఇంకొంతమంది ప్రముఖులు కూడా నవంబర్ 22న జరిగే మ్యాచ్‌ ప్రారంభోత్సవానికి హాజరవబోతున్నారు..దీంతో  స్టేడియం వద్ద కోల్‌కతా పోలీస్ శాఖ భారీగా భద్రత ఏర్పాటు చేయబోతోంది.
Read More :బుమ్రా రీ ఎంట్రీ, వెస్టిండీస్‌తో సిరీస్‌కు భువీ