రామమందిరం నిర్మించాలని సుప్రీం చెప్పింది..కొత్త అధ్యాయం మొదలైందన్న మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : November 9, 2019 / 12:50 PM IST
రామమందిరం నిర్మించాలని సుప్రీం చెప్పింది..కొత్త అధ్యాయం మొదలైందన్న మోడీ

యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య తీర్పును నవంబర్ 9,2019 శనివారం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడారు. చరిత్రాత్మక తీర్పుని సుప్రీంకోర్టు వెలువరించింది. దశాబ్దాల పాటు న్యాయప్రక్రియ కొనసాగింది. దీర్ఘకాలిక వివాదానికి సుప్రీంకోర్టు పరిష్కారం చూపింది. సుదీర్థ విచారణ అనంతరం తీర్పు వెలువడింది. దేశం మొత్తం సుప్రీం తీర్పుని స్వాగతించిందని ప్రధాని అన్నారు.  

ఇది భారతదేశం యొక్క ప్రాచీన సంస్కృతి మరియు సామాజిక సామరస్యం యొక్క సాంప్రదాయానికి రుజువు అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదానికి ఈ తీర్పు నిదర్శనమన్నారు. దేశంలో వ్యతిరేక భావజాలాన్ని కొత్తతరం స్వాగతించే పరిస్థితి లేదన్నారు. సుప్రీంకోర్టు బలమైన విల్ పవర్ చూపిందన్నారు. అతిక్లిష్టమైన అంశాలను రాజ్యాంగ పరిధిలో పరిష్కరించగలమని సుప్రీం చాటిచెప్పింది. రామమందిరాన్ని నిర్మించాలని సుప్రీం తీర్పు చెప్పింది. న్యాయవ్యవస్థలో ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించిన రోజు అని మోడీ తెలిపారు.

ఈ రోజు నవంబర్ 9, బెర్లిన్ గోడను కూల్చిన రోజు. ఈ రోజు కార్తార్పూర్ కారిడార్ కూడా ప్రారంభించబడింది. ఇప్పుడు అయోధ్య తీర్పు, కాబట్టి ఈ తేదీ మనకు ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని సందేశాన్ని ఇస్తుంది. భారత్ కు నవంబర్ 9 చారిత్రాత్మక రోజు. జాతి విలువలను సుప్రీం తీర్పు ప్రతిబింబించింది. దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడికి బాధ్యత ఉంది. దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. మనందరం కలిసికట్టుగా సవాళ్లను ఎదుర్కోవాలి.ఇదే స్ఫూర్తితో నవభారతాన్ని నిర్మిద్దాం. చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని, భవిష్య భారత్ కోసం పనిచేయాలని మోడీ అన్నారు.