జార్ఖండ్ ఫలితాలపై స్పందించిన మోడీ,షా

  • Published By: venkaiahnaidu ,Published On : December 23, 2019 / 04:10 PM IST
జార్ఖండ్ ఫలితాలపై స్పందించిన మోడీ,షా

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోడీ స్పందించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నాయకుడు హేమంత్ సోరెన్‌కు మోదీ అభినందనలు తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీలోని మొత్తం 81 స్థానాలకు  ప్రతిపక్ష జేఎంఎం,కాంగ్రెస్ కూటమి 47 స్థానాల్లో సత్తా చూపి ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవగా,అధికార బీజేపీ 25సీట్లకు పరిమితమై ఇంటిదారి పట్టింది. సీఎం రఘుబర్ దాస్ సైతం ఓటమి పాలయ్యారు. 

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్లో స్పందిస్తూ…జార్ఖండ్ ఎన్నికల్లో విజయం సాధించిన హేమంత్ సోరెన్‌కు, జేఎంఎం నేతృత్వంలోని కూటమికి అభినందనలు. రాష్ట్రానికి మంచి సేవలు అందించాలని ఆకాక్షిస్తున్నాను అని ట్వీట్ చేశారు. బీజేపీకి చాలా ఏళ్లపాటు రాష్ట్రానికి సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు జార్ఖండ్ ప్రజలకు ధన్యవాదాలు. కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకార్తల కృషిని మెచ్చుకుంటున్నాను.రాబోయే కాలంలో మేము రాష్ట్రానికి సేవ చేస్తూ ప్రజల వాయిస్ ను వినిపిస్తుంటామని మోడీ అన్నారు.
 
కాగా అంతకు ముందు బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ.. జార్ఖండ్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించడానికి ఇప్పటి వరకు అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కో్సం శ్రమించిన బీజేపీ కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని అమిత్ షా తెలిపారు.