బైడెన్, కమలా హారీస్‌లకు రాష్ట్రపతి, ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Published By: madhu ,Published On : November 8, 2020 / 09:52 AM IST
బైడెన్, కమలా హారీస్‌లకు రాష్ట్రపతి, ప్రధాని మోదీ శుభాకాంక్షలు

అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్‌కు, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న కమలాహారిస్‌కు అభినందలు తెలిపారు రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్‌. బైడెన్‌ విజయవంతంగా తన పదవిని నిర్వర్తించాలని ఆకాంక్షించారు రాష్ట్రపతి. భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఎదురుచూస్తున్నామన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.



అమెరికా 46వ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టున్న జో బైడెన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో భారత్‌ – అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో బైడెన్ పాత్ర అమూల్యమైనదన్నారు. మీతో కలిసి పనిచేసేందుకు, ఇరు దేశాల సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఎదురు చూస్తున్నానన్నారు మోదీ.



మరోవైపు ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న భారత సంతతి వ్యక్తి కమలా హారీస్‌ విజయంపై ప్రధాని మరో ట్వీట్‌ చేశారు. కమల విజయం మార్గదర్శకమన్నారు. భారతీయ-అమెరికన్లందరికీ గర్వకారణమన్నారు మోదీ. మీ సహకారంతో భారత్‌ -అమెరికా సంబంధాలు మరింత బలంగా ఉంటాయని విశ్వసిస్తున్నాన్నారు మోదీ



ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు జో బైడెన్‌. పెన్సిల్వేనియాలో 20 ఎలక్టోరల్ ఓట్లు రాగానే ఆయన గెలిచినట్టు అధికారంగా ప్రకటించారు. నెవెడాలోనూ ఆరు ఎలక్టోరల్ ఓట్లు రావడంతో 290 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు బైడెన్‌. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 214 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమయ్యారు