Govt School : గవర్నమెంట్ స్కూల్ టీచర్లకు సింగపూర్‌లో ట్రైనింగ్ : పంజాబ్‌ సీఎం వినూత్న యత్నం

ప్రభుత్వ ఉపాధ్యాయులకు సింగపూర్ లో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. దీనికి సంబంధించి టీచర్లను సింగపూర్ పంపించటానికి ఏర్పాట్లు కూడా చేసింది పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం.

Govt School : గవర్నమెంట్ స్కూల్ టీచర్లకు సింగపూర్‌లో ట్రైనింగ్ : పంజాబ్‌ సీఎం వినూత్న యత్నం

Punjab govt to send school principals to Singapore for teachers training

Govt School : ప్రభుత్వ ఉపాధ్యాయులకు సింగపూర్ లో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. దీనికి సంబంధించి టీచర్లను సింగపూర్ పంపించటానికి ఏర్పాట్లు కూడా చేసింది పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. విద్యా వ్యవస్థను పూర్తిగా మారుస్తామని ఆప్ పంజాబ్ ప్రజలకు హామీ ఇచ్చింది. దీంట్లో భాగంగానే..పాఠశాలల్లో విద్య నాణ్యతను మెరుగుపరచటానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను సింగపూర్‌కు పంపి శిక్షణ ఇస్తున్నామని అక్కడ ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ప్రకటించారు.

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులు దేశ నిర్మాతలు వారు మెరుగైన విద్యాప్రమాణాలు పిల్లలకు నేర్పించాలని అందుకోసం సింగపూర్ లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని దీంట్లో భాగంగా మొదటి బ్యాచ్ లో 36మంది ఉపాధ్యాయులు ఫిబ్రవరి 4న సింగపూర్ వెళ్లనున్నారని తెలిపారు. వీరు వృత్తిపరమైన శిక్షణ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 11న తిరిగి వస్తారని తెలిపారు.

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామనే ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చామని అది నెరవేర్చుకోవటానికి ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. రాష్ట్రం విద్యారంగంలో విప్లవ వాగ్దానం నెరవేర్చటానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విద్యా విధానంలో విప్లవం రావాలంటే..మొదటగా ఉపాధ్యాయుడు, పిల్లల తల్లిదండ్రుల మధ్య అంతరం తొలగిపోవాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలను స్కూల్ కు పంపించటమే బాధ్యత కాదని పిల్లలు ఎలా చదువుతున్నారో నిరంతరం గమనిస్తుండాలని సూచించారు. పిల్లల చదువుల విషయంలోనే కాదు వారి ప్రవర్తన ఎలా ఉంటోంది? అనేది కూడా గమనించాలన్నారు.

స్కూల్ కు వెళ్లిన పిల్లలు స్కూల్ విడిచిపెట్టాక ఏం చేస్తున్నారు? వారి ప్రవర్తన ఎలా ఉంటోంది? వారు ఏమేమి చేస్తున్నారు? అనే విషయంపై దృష్టి పెట్టాలన్నారు. విద్యార్ధుల అభిరుచుల గురించి ఉపాధ్యాయులు తెలుసుకోవాలని ఆ దిశగా ప్రోత్సహించాలని సూచించారు. ఉపాద్యాయులు ఎప్పటికప్పుడు వారి నైపుణ్యాలను పెంచుకుంటుండాలని సూచించారు. అది విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దానికోసం ఉపాధ్యాయులు విద్యాబోధనలో నైపుణ్యాలు పెంచుకునేందుకు సింగపూర్ లో శిక్షణ ఉపయోగపడుతుందని తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షమంది విద్యార్ధులు ప్రయోజనం పొందుతారని తెలిపారు.

సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన ప్రిన్సిపాల్స్ (ప్రధానోపాధ్యాయులు) తమ అనుభవాలను సహోద్యోగులతో, విద్యార్థులతో పంచుకుంటారని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయుల నైపుణ్యం, వృత్తిపరమైన సామర్థ్యాన్ని మరింత పెంచడంలో సింగపూర్ శిక్షణ సహాయపడుతుందని తెలిపారు. ఈ శిక్షణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సంస్కరించడానికి ఒక మైలురాయి అవుతుందని సీఎం మన్ ఆశాభావం వ్యక్తం చేశారు.