సరిహద్దు ఘర్షణ టైంలో.. చైనా మోడీని ఎందుకు ప్రశంసిస్తోంది?

  • Published By: venkaiahnaidu ,Published On : June 22, 2020 / 02:36 PM IST
సరిహద్దు  ఘర్షణ టైంలో.. చైనా మోడీని ఎందుకు ప్రశంసిస్తోంది?

తూర్పు లడఖ్ లోని  బోర్డర్ లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోడీని  టార్గెట్ చేశారు. గల్వాన్ లోయలో చైనా దురాక్రమణపై కేంద్రాన్ని నిలదీస్తూ వస్తున్న రాహుల్ ఇవాళ మరోసారి ట్విటర్ వేదికగా మోడీని టార్గెట్ చేశారు.  

చైనా మన సైనికులను చంపేసింది. మన భూ భాగాన్ని ఆక్రమించుకుంది. అయినా కూడా ఈ సంక్షోభంలో చైనా ఎందుకు ప్రధాని మోడీని పొగుడుతుందని రాహుల్ ట్వీట్ చేశారు. చైనా మీడియాలో వచ్చిన ఓ పత్రికా కథనాన్ని కూడా రాహుల్ ట్విట్టర్లో  జత చేశారు. నరేంద్ర మోడీ  వాస్తవానికి సరెండర్ మోడీ ’’ అంటూ రాహుల్ ఆదివారం విమర్శించిన విషయం తెలిసిందే. అంతేకాదు చైనా విషయంలో మాజీ ప్రధాని మన్మోహన్ చెప్పిన విషయాలను మోడీ ఫాలో అవుతే బాగుంటుందంటూ రాహుల్ సలహా ఇచ్చారు. 

గల్వాన్ లో ఘర్షణ తర్వాత ప్రధాని మోడీ ఇచ్చిన స్పీచ్ కు చైనా మీడియా కితాబిచ్చిన విషయం తెలిసిందే  గల్వాన్ లో చైనా-భారత్ సైనికుల ఘర్షణ తర్వాత ప్రధాని మోడీ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు. ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత మాట్లాడిన ప్రధాని మోడీ, మన దేశ భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని కామెంట్ చేశారు. ప్రస్తుతం మన భూభాగంలో ఎవరూ లేరని చెప్పారు. అంతేకాదు మన సైనిక పోస్టులను ఎవరూ ఆక్రమించుకోలేదని కూడా చెప్పారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలను చైనా మీడియా వెల్ కమ్ చెప్పింది. చాలా బాగా మాట్లాడారంటూ ప్రశంసించింది.

ప్రధాని కామెంట్స్ ను చైనాకు చెందిన అనేక మీడియా సంస్థలు సోషల్ మీడియాలో షేర్ చేశాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు దోహదపడే విధంగా భారత ప్రధాని మోడీ మాట్లాడారని, ఇది మంచి పరిణామం అని చైనా పత్రికలు కథనాలు రాశాయి. క్లిష్ పరిస్థితుల్లో సంయమనం కోల్పోకుండా భారత ప్రజలను, చైనాను రెచ్చగొట్టకుండా మోడీ చాలా తెలివిగా వ్యవహరించారని మెచ్చుకున్నాయి.

కాగా, గల్వాన్ వ్యాలీపై, పాంగోంగ్ త్సో సమీపంలో ఉన్న ఫింగర్ 4 అనే వ్యూహాత్మక లక్షణంపై నియంత్రణతో సాదించాలనుకున్నది  చైనా ఇప్పటికే  సాధించింది అని ఓ టాప్ రిటైర్డ్ ఆర్మీ కమాండర్ తెలిపారు. అయితే భారత ప్రభుత్వం అలాంటి వాదనను ఖండించింది.