రాహుల్ గాంధీ స్విమ్మింగ్.. వీడియోలు వైరల్

రాహుల్ గాంధీ స్విమ్మింగ్.. వీడియోలు వైరల్

Swimmer

Rahul Gandhi Jumps : ఎప్పుడూ పాలిటిక్స్‌తో బిజీగా ఉండే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అప్పుడప్పుడు సరదాగా కొన్ని పనులు చేస్తూ వార్తాల్లో నిలుస్తారు. కేరళలో పర్యటిస్తున్న రాహుల్ స్విమ్మర్‌‌గా మారారు. మత్స్యకారులతో కలిసి ఆయన సముద్రం మధ్యలో ఈత కొట్టారు. మత్స్యకారుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి రాహుల్‌ కేరళలోని కొల్లాం తీరంలో పర్యటించారు. వాడి బీచ్ నుంచి మత్స్యకారులతో కలిసి ఆయన సముద్రంలోకి వెళ్లారు. ఓ పడవలో సముద్రంలోకి వెళ్లిన ఆయన చేపలను పట్టేందుకు వల కూడా విసిరారు.

చేపల వల విసిరిన తర్వాత మత్స్యకారులతో పాటు సముద్రంలోకి దూకి అందరినీ ఆశ్చర్యపరిచారు రాహుల్. హఠాత్తుగా పడవలో నుంచి సముద్రంలో దూకి జాలర్లతో కలిసి ఈతకొట్టారు. సుమారు 10 నిమిషాలపాటు ఆయన ఈత కొడుతుంటే ..అప్పటివరకు ఆయనకు ఈత వస్తుందని తెలియనివాళ్లంతా తమ కళ్ల ముందు జరుగుతున్నది చూసి నోళ్లు వెళ్లబెట్టారు. ఆయనలో మంచి స్విమ్మర్ ఉన్నాడని అప్పుడే వారికి తెలిసింది. రాహుల్ ఈత కొట్టిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మరోవైపు మత్స్యకారులతో రాహుల్ దాదాపు రెండున్నర గంటలు గడిపారు. వారు తయారు చేసిన ఫిష్ కర్రీని బోటులో వారితో కలిసి ఆరగించారు. కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన ఆయన.. వీరి సమస్యలను తమ పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తానని హామీ ఇచ్చారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మత్స్య కారులు చేపల వేటలో జీవనం సాగించడాన్ని రాహుల్ అభినందించారు. రైతుల్లానే మత్స్యకారులు కూడా ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అన్నదాతలు భూమిపై వ్యవసాయం చేస్తే మత్స్య కారులు సముద్రంలో వ్యవసాయం చేస్తున్నారన్నారు.