Rajiv Gandhi Assassination: ఉగ్రవాదులం కాదు, బాధితులం.. రాజీవ్ గాంధీ హంతకులు

ఆర్టికల్ 161ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించే అధికారాల మేరకు రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించాలని సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని నళిని, రవిచంద్రన్ సైతం సుప్రీం తలుపు తట్టారు

Rajiv Gandhi Assassination: ఉగ్రవాదులం కాదు, బాధితులం.. రాజీవ్ గాంధీ హంతకులు

Rajiv Gandhi assassination convicts says we are victims not terrorists

Updated On : November 13, 2022 / 3:37 PM IST

Rajiv Gandhi Assassination: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు పాలై.. 31 ఏళ్ల అనంతరం శనివారం విడుదలైన ఆరుగురు దోషులు తమను బాధితులుగా చూడాలని అంటున్నారు. తాము హంతకులం కాదని, ఉగ్రవాదులం అసలే కాదని, తాము బాధితులమని ఆదివారం వారు పేర్కొన్నారు. ‘‘ఉత్తర భారత దేశానికి చెందిన వారు మమ్మల్ని ఉగ్రవాదులుగానో హంతకులుగానో చూడకండి. మమ్మల్ని బాధితులుగా చూడండి. ఎవరు ఉగ్రవాదులో, ఎవరు స్వాతంత్ర్య సమరయోధులో సమయం, అధికారం నిర్ణయిస్తుంది. అయితే మనం ఉగ్రవాదులమని అధికారం మనపై నిందలు మోపినప్పటికీ కాలం మనల్ని నిర్దోషులుగా నిర్ణయిస్తుంది’’ అని దోషుల్లో ఒకరైన రవిచంద్రన్ అన్నారు.

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. వారిని విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సుముఖత చూపటంతో పాటు సోనియాగాంధీ కుటుంబం నుంచి కూడా సానుకూలత రావడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా పట్టుబడి చాలా ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహర్, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్, రాజా, శ్రీహరన్, జయకుమార్ అనే దోషులు తమ విడుదలపై చాలా రోజులుగా కోర్టుకు అప్పీలు చేసుకుంటున్నారు.

ఈ విషయమై మద్రాస్ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దోషులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం సహా అందరి అభిప్రాయాల తీసుకున్న అనంతరం దోషులను విడుదల చేయాలని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ నాగరత్నాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇదే కేసులో దోషిగా ఉన్న ఫెరరీవాలన్‭ను విడుదల చేస్తూ జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలనే మిగిలిన ఆరుగురికి వర్తించేలా జస్టిస్ గవాయి ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

మే 21, 1991 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని, సంతన్, మురుగన్, ఏజీ పెరారివాలన్, రాబర్ట్ పయస్, జయకుమార్, రవిచంద్రన్‌ నిందితులు. 1998లోనే ఏడుగురికి మరణశిక్షణ విధించిన ఉగ్రవాద వ్యతిరేక కోర్టు, అనంతరం అది యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. కుమార్తెను చూసుకోవాలన్న అభ్యర్థన మేరకు మొదట నళిని మరణశిక్షణు యావజ్జీ కారాగార శిక్షగా ధర్మాసనం మార్చింది. సెప్టెంబర్ 9, 2018న జరిగిన కేబినెట్ సమావేశంలో రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషుల క్షమాభిక్ష ప్రసాదించాలని తమిళనాడు సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనిని గవర్నర్‭కు సిఫారసు చేసింది. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్ తీవ్ర ఆలస్యం చేశారు.

ఆర్టికల్ 161ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించే అధికారాల మేరకు రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించాలని సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని నళిని, రవిచంద్రన్ సైతం సుప్రీం తలుపు తట్టారు. కాగా, ఈ దోషుల్లో ఒకరైన పెరివాలన్ 30 ఏళ్ల జైలు జీవితం అనంతరం ఈ మధ్యే విడుదలయ్యారు. తాజా సుప్రీం తీర్పుతో మిగిలిన వారు కూడా విడుదలయ్యారు.

Airplane Stuck Under Bridge: అయ్యయ్యో ఎంత పనైందే! బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానం..