Cryptocurrency: క్రిప్టో కరెన్సీ నిషేధమేనా? ఆర్‌బీఐ ప్రతిపాదన ఇదే.. కేంద్రం ఏం ఆలోచిస్తోంది?

క్రిప్టో కరెన్సీపై ఆర్‌బీఐ కీలక ప్రతిపాదన చేసింది. క్రిప్టోకరెన్సీని పూర్తిగా నిషేధించడానికి ఆర్‌బీఐ అనుకూలంగా ఉందని సెంట్రల్ బోర్డ్‌కు వెల్లడించింది.

Cryptocurrency: క్రిప్టో కరెన్సీ నిషేధమేనా? ఆర్‌బీఐ ప్రతిపాదన ఇదే.. కేంద్రం ఏం ఆలోచిస్తోంది?

Crypto

Cryptocurrency: క్రిప్టో కరెన్సీపై ఆర్‌బీఐ కీలక ప్రతిపాదన చేసింది. క్రిప్టోకరెన్సీని పూర్తిగా నిషేధించడానికి ఆర్‌బీఐ అనుకూలంగా ఉందని సెంట్రల్ బోర్డ్‌కు వెల్లడించింది. మాక్రో ఎకనామిక్, ఆర్థిక స్థిరత్వానికి సంబంధించి.. క్రిప్టో కరెన్సీపై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తంచేస్తూ ఆర్‌బీఐ బోర్డుకు ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆర్‌బీఐ వైఖరిని బోర్డు సమర్థించింది.

క్రిప్టో కరెన్సీ లావాదేవీలతో పాటు విదేశాల్లో ఉండే ఆస్తుల క్రమబద్ధీకరణ కూడా సవాల్‌గా మారిందని సెంట్రల్ బ్యాంకు అభిప్రాయపడింది. ఫారిన్‌ ఎక్సేంజ్‌లో ట్రేడింగ్‌కు ఇవి అనుకూలంగా ఉండడంతో లావాదేవీలు ఎవరు జరిపారో తెలుసుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది.

క్రిప్టోకరెన్సీ ఆర్‌బీఐకి తీవ్ర ఆందోళన కలిగించే విషయమని గతంలోనే గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. అత్యున్నత బ్యాంక్‌గా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, గతంలో అనేక సార్లు ఆయన ప్రస్తావించారు. సాంకేతిక పరంగా ఆర్థిక రంగానికి క్రిప్టో కరెన్సీ వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అనే కోణంలో కూడా కొందరు పరిశీలించినప్పటికీ దీనిపై సానుకూలత వ్యక్తం కాలేదు.

సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, ప్రయివేట్ క్రిప్టో కరెన్సీకి సంబంధించి అనేక కోణాలను రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ పరిశీలించింది. క్రిప్టో కరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ నియంత్రణ బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే క్రిప్టో కరెన్సీ లావాదేవీలను, బిల్లు పూర్వాపరాలను మరోసారి పరిశీలించాలని భావించిన కేంద్రం ప్రస్తుతానికి ఆ విషయాన్ని పక్కనబెట్టింది.

బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశముంది. ఆర్‌బీఐ జారీచేసేలా అధికారిక డిజిటల్ కరెన్సీ రూపొందించేందుకు ఫ్రేమ్‌వర్క్ చేయాలన్నది ఈ బిల్లు సారాంశం. భారత్‌లో ప్రయివేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించడం, సాంకేతిక పరంగా కొన్ని రకాల క్రిప్టో కరెన్సీలు ఉపయోగించేందుకు కొన్ని మినహాయింపులు ఇవ్వడం అనే అంశాలను కూడా బిల్లులో పొందుపరచనున్నారు.

క్రిప్టో కరెన్సీలపై జరిగే ఫ్రేమ్‌వర్క్‌పై ప్రధాని మోదీ అంతిమ నిర్ణయం తీసుకోనున్నారు. ప్రయివేట్ క్రిప్టో కరెన్సీ నిషేధం, అధికారిక డిజిటల్ కరెన్సీపై విస్తృత సంప్రదింపులు తర్వాతే ఆర్‌బీఐ ఓ నిర్ణయానికి రానుంది. ఇప్పటికే ప్రధాని అనేక సార్లు దీనిపై చర్చించారు. అన్ని రకాల ప్రయివేట్ క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించాలని 2019 జులైలో ప్రభుత్వ ఉన్నత స్థాయి ప్యానెల్ సూచించింది.

క్రిప్టో కరెన్సీతో లావాదేవీలు జరిపేవారికి 25 కోట్ల ఫైన్ విధించాలని, 10 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రతిపాదించింది. క్రిప్టో కరెన్సీతో ఆన్‌లైన్ మోసాలు, కాల్ మనీ మోసాలు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. విదేశాల నుంచి వచ్చే నిధులు, స్వదేశం నుంచి జరుగుతున్న నగదు బదలాయింపుల్లో… క్రిప్టో కరెన్సీ రూపంలో అనేక అక్రమాలు జరుగుతున్నట్టు ఈడీ గుర్తించింది.