విలువైన వ్యూహాత్మక భాగస్వామి సౌదీ అరేబియా

  • Published By: venkaiahnaidu ,Published On : February 20, 2019 / 01:49 PM IST
విలువైన వ్యూహాత్మక భాగస్వామి సౌదీ అరేబియా

భారతదేశపు అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఒకటి అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. భారత్-సౌదీ దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయన్నారు.భారత్ లో..ఎనర్జీ, రిఫైనింగ్,పెట్రోకెమికల్స్,వ్యవసాయం,మౌలిక సదుపాయాలు,ఉత్పత్తి రంగాల్లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు సౌదీ యువరాజు చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని మోడీ అన్నారు.

దక్షిణాసియా, చైనా పర్యటనలో భాగంగా మొదటగా పాక్ పర్యటన ముగించుకొని మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకొన్నారు  సౌదీ అరేబియా యువరాజు మహమద్ బిన్ సల్మాన్.  బుధవారం(ఫిబ్రవరి-20,2019) భారత్, సౌదీ ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం మోడీ-బిన్ సల్మాన్ లు జాయింట్ స్టేట్ మెంట్ విడుదల చేశారు.  వీరి సమక్షంలో రెండు దేశాలు మధ్య కుదుర్చుకొన్న ఎంవోయూలను ఇచ్చిపుచ్చుకొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. భారత్-సౌదీ సంబంధాలు మరింత బలపడుతున్నాయన్నారు. అంతర్జాతీయ సోలార్ కూటమిలో సౌదీ అరేబియా చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.  మన రక్షణ సహకారాన్ని ఏ విధంగా ఇంకా  బలోపేతం చెయ్యాలన్నదానిపై తాను, సౌదీ యువరాజు చర్చించుకొన్నామని మోడీ తెలిపారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి లాంటిదే మిగతా దేశాల్లో కూడా జరిగే ప్రమాదముందని, ఇలాంటివి జరగకుండా ముందుగానే ఉగ్రవాద మూలాలను పెకలించి వేయాల్సిన అవసరముందని మోడీ అన్నారు. ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్న దేశాలపై మరింత ఒత్తిడి పెంచాల్సిన అవసరముందని తామిద్దరం అంగీకరించామని తెలిపారు.

ఈ సందర్భంగా సౌదీ యువరాజు బిన్ సల్మాన్ మాట్లాడుతూ.. టెర్రరిజం, ఎక్స్ ట్రీమిజం రెండూ మన సహజ ఆందోళన. అన్ని రంగాల్లో  సహకరిస్తామని  ఫ్రెండ్ అయిన భారత్ కు చెప్పదల్చుకొన్నాం. అది ఇంటిలిజెన్స్   షేరింగ్ లో కూడా ఉంటుంది. రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు మేం అందరితో కలిసి పనిచేస్తాం అని సల్మాన్ తెలిపారు.