చిద్దూకి సుప్రీం షాక్… బెయిల్ పిటిషన్ తిరస్కరణ

  • Published By: venkaiahnaidu ,Published On : August 26, 2019 / 07:01 AM IST
చిద్దూకి సుప్రీం షాక్… బెయిల్ పిటిషన్ తిరస్కరణ

మాజీ కేంద్రమంత్రి చిదంంబరానికి సుప్రీంకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. INX మీడియా కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిస్కరించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం తేల్చిచెప్పింది. సీబీఐ అరెస్ట్ విషయంలో తలదూర్చలేమని స్పష్టం చేసింది.

సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సుప్రీం సూచించింది. చిదంబరం ఇప్పటికే ఆరెస్ట్ అయినందున పిటిషన్ చెల్లదని తెలిపింది. చిదంబరం అరెస్ట్‌కు వ్యతిరేకంగా ప్రముఖ న్యాయవాది,కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఆయన అరెస్టు కావడానికి ముందే పిటిషన్ దాఖలు చేశామని చిదంబరం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అరెస్టు తర్వాత దాఖలు చేసిన పిటిషన్ ఇంకా లిస్టు కాలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సీబీఐ కస్టడీని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై తర్వాత విచారణ చేపడుతామని కోర్టు స్పష్టం చేసింది. చిదంబరంపై జరుగుతున్న విచారణ నిబంధనలకు విరుద్దంగా ఉందని మరో లాయర్ అభిషేక్ మనుసింఘ్వి వాదనాలు వినిపించారు. ఈ వాదనల్ని ధర్మాసనం తోసిపుచ్చింది. INX మీడియా కేసులో నాటకీయ పరిణామాల మధ్య బుధవారం(ఆగస్టు-21,2019) చిదంబరంని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చిదంబరం ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు.