జమ్మూ కాశ్మీర్ లో సెల్ ఫోన్ సేవలు పునరుధ్ధరణ

  • Published By: chvmurthy ,Published On : January 18, 2020 / 01:06 PM IST
జమ్మూ కాశ్మీర్ లో సెల్ ఫోన్ సేవలు  పునరుధ్ధరణ

జమ్మూ కశ్మీర్‌లో ప్రీపెయిడ్‌ మొబైల్‌ సేవలను పునరుద్ధరించారు. దాదాపు 6 నెలల తర్వాత  ప్రీపెయిడ్‌ మొబైల్‌ సేవల్లో భాగంగా వాయిస్‌ కాల్స్‌, మెసేజ్‌ సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్‌ ప్రధాన కార్యదర్శి రోహిత్‌ కన్సాల్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. శనివారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. కాశ్మీర్‌లోని బండిపోరా, కుప్వారా జిల్లాతో సహా ..జమ్మూలోని పది జిల్లాల్లో బ్రాడ్‌బాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను తిరిగి ప్రారంభించాలని ఆయన కోరారు.

ఈ పునరుధ్దరించబడిన సేవలు ప్రభుత్వ అనుమతి పొందిన వెబ్ సైట్‌లకు మాత్రమే పరిమితం చేయబడుతుందని… సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లుపై ఇంకా నిషేధం అమలులోనే ఉంటుందని ఆయన తెలిపారు. జమ్మూలో, ఈవారం ప్రారంభంలో  బ్రాడ్ బ్యాండ్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 అయితే స్ధానిక పరిస్థితుల కారణంగా, ప్రయివేటు ఇంటర్నెట్ సెంటర్ సేవలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్ ఇచ్చే ముందు..ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చే ముందు, టెలికాం సర్వీసు ప్రొవైడర్లు చందాదారుల  ధృవీకరణ పత్రాలను పూర్తిగా పరిశీలించి ఇవ్వాలని ఆదేశించారు. 

జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని గతేడాది ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శాంతి భద్రతలు పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని జమ్మూ కశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలు, అన్ని ప్రీపెయిడ్‌ మొబైల్‌ సేవలను నిలిపివేస్తూ టెలికాం శాఖ ఆంక్షలు విధించింది.