Sonu Sood : చలించిపోయిన సోనూ సూద్.. డాక్టర్లకు మూడు సూటి ప్రశ్నలు..

కరోనా కష్టకాలంలో పేదల పాలిట దేవుడిలా మారిన సోనూసూద్ కి, ఎవరు ఎలాంటి సాయం కోరినా చిరునవ్వుతో స్పందించే సోనూసూద్ కి ఇప్పుడు పట్టరాని కోపం వచ్చింది. డాక్టర్లను ఉద్దేశిస్తూ రియల్ హీరో సోనూసూద్ మూడు ప్రశ్నలు సంధించాడు. కొన్ని ఇంజెక్షన్లు అందుబాటులో లేవని తెలిసినా ఎందుక వాటిని రెకమెండ్ చేస్తున్నారని ప్రశ్నించాడు.

Sonu Sood : చలించిపోయిన సోనూ సూద్.. డాక్టర్లకు మూడు సూటి ప్రశ్నలు..

Sonu Sood Urges Doctors

Sonu Sood Urges Doctors : కరోనా కష్టకాలంలో పేదల పాలిట దేవుడిలా మారిన సోనూసూద్ కి, ఎవరు ఎలాంటి సాయం కోరినా చిరునవ్వుతో స్పందించే సోనూసూద్ కి ఇప్పుడు పట్టరాని కోపం వచ్చింది. డాక్టర్లను ఉద్దేశిస్తూ రియల్ హీరో సోనూసూద్ మూడు ప్రశ్నలు సంధించాడు. కొన్ని ఇంజెక్షన్లు అందుబాటులో లేవని తెలిసినా ఎందుక వాటిని రెకమెండ్ చేస్తున్నారని ప్రశ్నించాడు.

‘ఒక ఇంజెక్షన్ ఎక్కడా దొరకడం లేదని తెలిసినా.. డాక్టర్లు ఎందుకు అదే సూచిస్తున్నారు? పెద్ద పెద్ద ఆసుపత్రులకే ఆ మెడిసిన్ దొరకని పరిస్థితి ఉంటే.. ఇక సామాన్యులకు ఎలా దొరుకుతుంది? ప్రత్యామ్నాయ ఔషధాలను వాడి ప్రజల జీవితాలను కాపాడలేమా? అంటూ.. పరోక్షంగా రెమ్ డెసివిర్ కొరత గురించి సోనూసూద్ ప్రశ్నించాడు.

కరోనా రోగుల చికిత్సలో రెమ్ డెసివిర్ సమర్థవంతంగా పని చేస్తుందనే ప్రచారం ఉంది. దీంతో రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ కు భారీగా డిమాండ్ ఏర్పడింది. దేశవ్యాప్తంగా రెమ్ డెసివిర్ ఇంజక్షన్ల కొరత ఉంది. దీంతో కొందరు కేటుగాళ్లు బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులను చూసి సోనూ చలించిపోయాడు. డాక్టర్లను ఉద్దేశించి మూడు ప్రశ్నలు సంధించాడు. కోవిడ్ చికిత్సకు అందుబాటులో లేని మందులకు ప్రత్యామ్నాయంగా ఇతర మందులను సూచించాలని డాక్టర్లకు విజ్ఞప్తి చేశాడు.

సోనూ ప్రశ్నలకు భారీగా సపోర్ట్ లభించింది. పెద్దసంఖ్యలో నెటిజన్లు సోనూకి మద్దతు తెలిపారు. ఎక్కడా దొరకని ఇంజెక్షన్లు సామాన్యులకు ఎక్కడ లభిస్తాయి? సోనూ వేసిన ఈ ప్రశ్నలు పరిగణలోకి తీసుకోవాల్సిందే అని కామెంట్స్ పెడుతున్నారు. కాగా, బ్లాక్ మార్కెట్ పెంచేందుకే డాక్టర్లు ఇలా చేస్తున్నారని కొందరు విమర్శలు చేయగా.. వేరే మార్గం లేక అవి సిఫార్సు చేయాల్సి వస్తోందని డాక్టర్లు అంటున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా కష్టకాలంలో నటుడు సోనూసూద్ ఎంతోమందికి సాయం అందిస్తున్నాడు. సోనూ ప్రజాసేవ కారణంగా ప్రధాని లాంటి వారికి కూడా రాని క్రేజ్ అతడి సొంతమైంది. ముఖ్యంగా సాయం చేయండి అని ఎవరైనా అడిగితే చాలు.. నేనున్నాను అంటూ సోనూసూద్ ముందుకు వస్తున్నాడు. దీంతో సోనూ సూద్‌ను ఆశ్రయించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సెలబ్రిటీలు సైతం సాయం కోసం సోనూను ఆశ్రయిస్తున్నారు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్… ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో వాటికి సంబంధించిన ఇంజెక్షన్ల కోసం సోషల్ మీడియా వేదికగా చాలామంది సోనూను సాయం అర్థిస్తున్నారు. తాజాగా విశాఖ నగరానికి చెందిన ఓ వ్యక్తి.. తన భార్య ప్రాణాపాయ స్థితిలో ఉందని, ఆమెకు కావాల్సిన ఇంజెక్షన్ దొరకడం లేదంటూ సోనూ సూద్‌కు ట్వీట్ చేస్తూ ఆదుకోవాలని కోరాడు. ఆ ఇంజెక్షన్ దొరకడం కష్టమే అయినా.. సోనూసూద్ పెద్ద మనసు చేసుకుని దాన్ని బాధితుడికి అందజేశాడు. అయితే ఇలాంటి బాధితుల సంఖ్య బాగా పెరుగుతోంది. పెద్దఎత్తున సోనూకు అభ్యర్థనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులకు సూటి ప్రశ్న వేశారు సోనూ. ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి.