కేరళ జర్నలిస్ట్ అరెస్ట్…యూపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసు

  • Published By: venkaiahnaidu ,Published On : November 16, 2020 / 03:36 PM IST
కేరళ జర్నలిస్ట్ అరెస్ట్…యూపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసు

కేరళకు చెందిన జర్నలిస్ట్ సిద్దిఖీ కప్పాన్ అరెస్ట్ విషయంలో సోమవారం(నవంబర్-16,2020)ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. సిద్దిఖీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ మరియు సిద్దిఖీకి బెయిల్ మంజూరు చేయాలని దాఖలైన పిటిషన్ పై స్పందన తెలియజేయాలని యోగి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.



కాగా, సెప్టెంబర్-14,2020న ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో ఓ దళిత యువతిపై జరిగిన సమూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అత్యాచార బాధితురాలు తీవ్రగాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన తర్వాత యూపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.



https://10tv.in/tv-anchor-arnab-goswami-gets-interim-bail-from-supreme-court-in-abetment-to-suicide-case/
అయితే, అక్టోబర్-5,2020న హత్రాస్ వెళ్లేందుకు బయలుదేరిన కేరళకు చెందిన జర్నలిస్ట్ సిద్దిఖీ క్పపాన్ ని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిఖీపై ఉగ్ర వ్యతిరేక చట్టం(UAPA) లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు(నిరోధక)చట్టం కింద కేసులు నమోదుచేశారు. ఆయనను మథుర జైలులో ఉంచారు.



సిద్దిఖీ అరెస్ట్ ని ఖండించిన కేరళ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్..ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆర్టికల్32 కింద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిద్దిఖీకి న్యాయ సహాయం మరియు కుటుంబసభ్యులను కలిసే అవకాశంతో కలిపి కనీస హక్కులను కల్పించాలని ఆ పిటిషన్ లో కోరారు. అంతేకాకుండా, మథుర జైలులో ఖైదీల మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలపై విచారణకు ఆదేశించేలా మథుర జిల్లా జడ్జి లేదా హైకోర్టు జడ్జికి ఆదేశాలివ్వాలని పిటిషన్ లో సుప్రీంకోర్టుని కోరారు.



పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తోన్న సీనియర్ లాయర్ కపిల్ సిబల్..సిద్దిఖీ కప్పాన్ కి బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టుని కోరారు. సిద్దిఖీని కలిసేందుకు లాయర్లు జైలుకి వెళ్లగా అయితే సిద్దిఖీని కలిసేందుకు మెజిస్ట్రేట్ అనుమతించలేదని సిబల్ కోర్టుకి తెలిపారు.



ఈ పిటిషన్ ని వాచిరిస్తున్న సీజేఐ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం..తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మొదట అలహాబాద్ హైకోర్టుకి వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టుకి ఎందుకొచ్చారని పిటిషనర్లని సీజేఐ ఎస్ఏ బోబ్డే ప్రశ్నించారు. ఆర్టికల్ 32 పిటిషన్లను ప్రోత్సహించకూడదని తాము ప్రయత్నిస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, రాజ్యాంగంలోని ఆర్టికల్-32…ఒకవేళ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే రిలీఫ్ కల్పించే అధికారం సుప్రీంకోర్టుకి ఉంటుంది.



అయితే సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలకు కపిల్ సిబల్ సమాధానమిస్తూ…గతంలో ఆర్టికల్ 32లో జడ్జిలు జోక్యం చేసుకున్నారని గత ఉదహరణలను ప్రస్తావించారు. ప్రస్తుతం ఓ జర్నలిస్ట్ వ్యవహారంలో జోక్యం కోరుతున్నామని, అసాధారణ పరిస్థితులు ఉన్నాయని సిబల్ పేర్కొన్నారు. కపిల్ సమాధానం విన్న సీజేఐ..యూపీ ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.