ఢిల్లీలో ఉగ్ర కదలికలు : ఎయిర్ పోర్ట్‌ల్లో హై అలర్ట్

  • Published By: veegamteam ,Published On : October 3, 2019 / 09:03 AM IST
ఢిల్లీలో ఉగ్ర కదలికలు : ఎయిర్ పోర్ట్‌ల్లో హై అలర్ట్

ఢిల్లీలో న‌లుగురు జైషే ఉగ్ర‌వాదులు చొర‌బ‌డిన‌ట్లు ఇంటెలిజెన్స్ హెచ్చ‌రిక‌లు రావ‌డంతో భ‌ద్ర‌త‌ను ప‌టిష్టం చేశారు. ఈక్రమంలో ఉత్త‌రాదిలోని అన్ని విమానాశ్ర‌యాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భారీ భ‌ద్ర‌త‌ను పెంచారు.   న‌లుగురు ఉగ్ర‌వాదులు భారీ ఆయుధాల‌తో ఢిల్లీలోకి ప్ర‌వేశించిన‌ట్లు స‌మాచారం రావటంతో భద్రతను కట్టుదిట్టం చేయటంతో పాటు అధికారులంతా అలర్ట్ అయ్యారు.

ఢిల్లీతో పాటు స‌మీప ప‌ట్ట‌ణాల్లో భారీ స్థాయిలో కూంబింగ్ నిర్వ‌హిస్తున్నారు. నగరంలో ఉగ్రవాదులు చొరబడ్డారనే హెచ్చరికలతో ఈ రోజు ఉద‌యం ప్ర‌ధాని మోదీ నివాసంలో కీలక నేతలు సమావేశమై చ‌ర్చలు జరిపారు. కశ్మీర్ విషయంలో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు అనంతరం నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉగ్రవాదులు పలు ప్రాంతాలలో ఉగ్ర‌దాడులు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు భ‌ద్ర‌తా ద‌ళాల‌కు హెచ్చ‌రిక‌లు అందాయి.  శ్రీన‌గ‌ర్‌, అవంతిపురా, జ‌మ్మూ, ప‌ఠాన్‌కోట్‌, హిండ‌న్ లాంటి వైమానిక స్థావ‌రాల వ‌ద్ద ఆరెంజ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.
హెచ్చరికల క్రమంలో తాము అన్ని భద్రతాచర్యలు తీసుకున్నామని ఢిల్లీ సెంట్రల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎంఎస్ రాంధవా తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ,ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు అందిన సమాచారం ప్రకారం..జైష్-ఎ-మొహమ్మద్ వైమానిక స్థావరాలపై ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. 

హెచ్చరికలతో ముందు జాగ్రత్తగా ఢిల్లీ ప్రధాన ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. అనుమానమున్నవారిని ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. బుధవారం రాత్రి ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం,ఇంటలిజెన్స్ కి చెందిన అధికారులు కలిసి సిటీలోని 9లొకేషన్స్ లో రైడ్స్ నిర్వహించారు. ఇద్దరు అనుమానితులని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.