మమతకి భారీ షాక్ : రవాణాశాఖ మంత్రి రాజీనామా…స్వాగతం పలికిన బీజేపీ

  • Published By: venkaiahnaidu ,Published On : November 27, 2020 / 11:31 PM IST
మమతకి భారీ షాక్ : రవాణాశాఖ మంత్రి రాజీనామా…స్వాగతం పలికిన బీజేపీ

TMC heavyweight Suvendu Adhikari resigns పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉందన్న అంచనాల మధ్య రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అటు అధికారాన్నికాపాడుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్‌ (టీఎంసీ) శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పార్టీలో రగులుతున్న అసమ్మతి సెగలు, రాజీనామాలతో టీఎంసీ కష్టాల్లో కూరుకుపోతోంది. మరోవైపు తిరుగుబాటు నాయకులను బుజ్జగించి కాషాయ దళంలో చేర్చుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.



కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మరోమారు అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న మమతా బెనర్జీకి అసమ్మతి సెగ భారీగానే తగులుతోంది. అండగా ఉండాల్సిన నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. తాజాగా, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ సీనియర్ నాయకుడు, రవాణా శాఖ మంత్రి “సువేందు అధికారి” శుక్రవారం(నవంబర్-27,2020)మంత్రి పదవికి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన చివరకు ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.



దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీకి భారీ షాక్‌ తగిలినట్టయింది. గురువారం హూగ్లీ రివర్ బ్రిడ్జ్ కమిషన్‌ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఆయన తాజాగా మంత్రి పదవికి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన సీఎంకు శుక్రవారం ఒక లేఖ రాశారు. తన రాజీనామాను వెంటనే అంగీకరించాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. నిబద్ధత, అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేశానని లేఖలో పేర్కొన్నారు.



మరోవైపు, తిరుగుబాటు నాయకులను బుజ్జగించి కాషాయ దళంలో చేర్చుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. తాజా పరిణామాలపై బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పందిస్తూ… సువేందు అధికారికి బీజేపీ ద్వారాలు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. అధికార పార్టీ తీరు పట్ల మరికొంతమంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, వారికి కూడా బీజేపీలోకి ఆహ్వానం పలుకుతున్నామన్నారు.



సువెంద్‌ రాజీనామా టీఎంసీ పతనానికి సంకేతమనీ, ఇక ఆ పార్టీ తెరమరుగవ్వడం ఖాయమన్నారు. అంతేకాదు “ఈ రోజు పెద్ద వికెట్ పడిపోయింది” ఇక ఆత్మగౌరవమున్న నాయకులంతా టీఎంసీకి గుడ్‌బై చెబుతారని ఘోష్ జోస్యం చెప్పారు. అదొక మునిగిపోతున్న ఓడ, అందులో కెప్టెన్ మినహా ఎవరూ ఎవ్వరూ ఉండరన్నారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలు బీజేపీకి సెమీ ఫైనల్. తామిపుడు 2020 లో ప్రధాన లక్ష్యానికి ముందుకుపోతున్నాం.. సువెందు అధికారి తమ పార్టీలోచేరితే ఇది మరింత ఊపందుకుంటుదన్నారు.



సువేందు రాజీనామాపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌ స్పందిస్తూ… టీఎంసీ ముగింపు ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ఆయన బీజేపీలో చేరితే పార్టీకి, ఆయనకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.



మరోవైపు కూచ్‌బెహార్‌కు చెందిన టీఎంసీ మాజీ ఎమ్మెల్యే మిహిర్ గోస్వామి శుక్రవారం సాయంత్రం బీజేపీ తీర్థం పుచ్చుకన్నారు. దీంతో 294 మంది సభ్యుల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది.