టీఎంసీ వర్సెస్ బీజేపీ…ఈసీకి పోటాపోటీ లేఖలు

టీఎంసీ వర్సెస్ బీజేపీ…ఈసీకి పోటాపోటీ లేఖలు

Trinamool vs BJP ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార తృణ‌మూల్ కాంగ్రెస్‌, బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. బుధ‌వారం నందిగ్రామ్ టీఎంసీ అభ్యర్థిగా నామినేష‌న్ వేసిన మ‌మ‌తా బెన‌ర్జీ.. సాయంత్రం ప్రచారం ముగించుకొని బయల్దేరేందుకు కారు ఎక్కుతున్న సమయంలో తోపులాట జరిగి మమత కాలికి తీవ్ర గాయమైన విష‌యం తెలిసిందే. త‌న‌ను 4-5వ్యక్తులు ఉక్కసారిగా తోసేసారని తోసేశార‌ని మమత ఆరోపిస్తుండ‌గా.. ఎన్నిక‌ల ముందు డ్రామా అని బీజేపీ కౌంట‌ర్ ఇస్తోంది. ఇరు పార్టీలు ఎన్నిక‌ల సంఘానికి ఒక‌రిపై మ‌రొక‌రు ఫిర్యాదులు చేసుకుంటూ లేఖ‌లు పంపించారు. మమతని హ‌త్య చేయ‌డానికి జ‌రిగిన కుట్ర ఇది అని తృణ‌మూల్ ఆరోపించ‌గా.. అవ‌న్నీ అబద్ధాల‌ని, ఆ ఫుటేజీ చూపించాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

ప‌శ్చిమ బెంగాల్ డీజీపీని తొల‌గించిన 24 గంట‌ల్లోపే సీఎంపై హ‌త్యాయ‌త్నం చేశార‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ త‌న లేఖ‌లో ఆరోపించింది. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించ‌కుండానే ఎన్నిక‌ల సంఘం డీజీపీని తొల‌గించింద‌ని టీఎంసీ చెబుతోంది. డీజీపీని తొల‌గించ‌డం, ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు అక్క‌డ పోలీసులు లేక‌పోవ‌డంపై తృణ‌మూల్ ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతోంది. కొంద‌రు సంఘ విద్రోహ శ‌క్తుల‌ను నందిగ్రామ్‌కు త‌ర‌లించిన‌ట్లు త‌మ‌కు స‌మాచారం ఉంద‌ని ఆ పార్టీ తెలిపింది.

అయితే బీజేపీ మాత్రం ఈ ఆరోప‌ణ‌ల‌ను ఖండించింది. ఓ సీఎం భ‌ద్ర‌త‌కు సంబంధించిన విష‌యంలో ఈ ఆరోప‌ణ‌లు ఏంట‌ని ప్రశ్నిస్తోంది. సీఎం ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌తా సిబ్బంది, వేలాది మంది పోలీసులు ఉన్నా ఇది ఎలా జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించింది. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేసింది. అంతేకాదు ఆ స‌మ‌యంలోని వీడియో ఫుటేజీని బ‌య‌ట‌పెడితే అస‌లు సంగ‌తేంటో తెలుస్తుంద‌ని పేర్కొంది.

మరోవైపు, మమతపై దాడి ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు అక్క‌డే ఉన్న ప్ర‌త్య‌క్ష సాక్షుల క‌థ‌నం మాత్రం మ‌రోలా ఉంది. కారు వెళ్తున్న స‌మ‌యంలో మమత సీట్లో కూర్చున్నారు. అయితే డోర్ మాత్రం తెరిచే ఉంది. ఆ త‌ర్వాత ఆ డోర్ పోస్ట‌ర్‌కు త‌గ‌లడంతో అది మూసుకుపోయింది. అంతే త‌ప్ప మ‌మ‌త‌ను ఎవ‌రూ తోయ‌లేదు, ఆమెపై చేయి చేసుకోలేదు అని ప్ర‌త్య‌క్ష సాక్షి చిత్త‌రంజ‌న్ దాస్ స్ప‌ష్టం చేశాడు. మ‌మ‌తను ఎవ‌రూ తోయ‌లేద‌ని, ఆమెను చూడ‌టానికి భారీగా జ‌నం వ‌చ్చార‌ని మరో ప్ర‌త్య‌క్ష సాక్షి సౌమెన్ మైతీ అనే విద్యార్థి చెప్పాడు. తాను ఏ రాజ‌కీయ పార్టీకి చెందిన‌వాడిని కాద‌ని కూడా అత‌డు చెప్పాడు.