అయోధ్య మసీదు నిర్మాణానికి ‘CM యోగిని ఆహ్వానిస్తాం : IICF

  • Published By: nagamani ,Published On : August 8, 2020 / 06:02 PM IST
అయోధ్య మసీదు నిర్మాణానికి ‘CM యోగిని ఆహ్వానిస్తాం : IICF

అయోధ్యలో రామ మందిరం భూమిపూజ ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎంతో కన్నుల పండుగగా జరిగింది. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్యలో మసీదు కూడా నిర్మించాల్సి ఉంది. అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ చర్యల్ని ముమ్మరం చేసింది. ఈ మసీదు నిర్మాణ శంకుస్థాపనకు యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌ను ఆహ్వానిస్తామని ముస్లిం నేతలు శనివారం (ఆగస్టు 8,2020) ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసిఎఫ్) వెల్లడించింది.

అయోధ్యలోని ధన్నీపూర్‌లోని ఐదు ఎకరాల భూమిలో నిర్మించబోయే మసీదు శంకుస్థాపనకు యోగీని కచ్చితంగా ఆహ్వానిస్తామని తెలిపారు. ఈ విషయమై ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి అథర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘ధన్నీపూర్‌లో 5 ఎకరాల విస్తీర్ణంలో మసీదు నిర్మాణం చేపడుతున్నామని..ఈ మసీదు ఆవరణలో ఓ ఆసుపత్రి, గ్రంథాలయం, వంటశాలతో పాటు ఓ అధ్యయన కేంద్రాన్ని కూడా నిర్మిస్తామని తెలిపారు. ఈ మసీదు శంకుస్థాపనకు సీఎం యోగీని తప్పకుండా ఆహ్వానిస్తామని తెలిపారు..ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారనీ..ప్రజల సౌకర్యానికి నిర్మించే వాటికి ఆర్థిక సహాయం కూడా అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ధన్నీపూర్‌లో నిర్మించే మసీదుకు ‘బాబ్రీ మసీదు’ అనే పేరునే పెడతారా? అని మీడియా ప్రశ్నించగా..పేర్లకు అంత ప్రాముఖ్యం లేదని, మసీదు మాత్రమే తమకు ముఖ్యం అని స్పష్టంచేశారు.అటువంటివి పెద్దగా ఉపయోగం ఉండవనీ..దీన్ని అనవసరంగా వివాదంగా మార్చవద్దని సూచించారు.

కాగా..అయోధ్యలో రామమంది నిర్మాణం భూమిపూజ పూర్తి అయిన తరువాత సీఎం యోగీని మీడియా ప్రశ్నిస్తూ..భూమిపూజకు ముస్లింలకు కూడా ఆహ్వానించారు కదా..మరి మసీదు నిర్మాణ శంకుస్థాపనకు మీరు వెళతారా? అని ప్రశ్నించగా.. ఒకవేళ మసీదు ప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం వస్తే..ఆ కార్యక్రమానికి ఓ హిందువుగా తాను వెళ్ళను అని సీఎం యోగి చెప్పారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘నేను ఓ యోగిని. హిందువుగా నేను మసీదు ప్రారంభానికి వెళ్లను. రాష్ట్ర సీఎంగా అడిగితే మతం, కులంతో నాకు ఎటువంటి సంబంధం లేదు.

ఒక యోగిగా నన్ను అడిగితే హిందువుగా మసీదు ప్రారంభానికి వెళ్లను. నా పద్ధతులను అనుసరించడం ఓ హిందువుగా నా కర్తవ్యం. అందుకు అనుగుణంగానే నడుచుకుంటాను. నన్ను పిలిచినా పిలవకపోయినా నేను హాజరుకాను అని తెలిపిన విషయం తెలిసిందే.అయినా నన్ను పిలవరు అసలు నాకు అలాంటి ఆహ్వానం అందదు అని యోగీ అన్నారు. చూడాలి మరి మసీదు శంకుస్థాపనకు ముస్లింల నుంచి ఆహ్వానం వెళితే యోగీ వెళ్తారా లేదా అనేది.