అత్త వేడి ఆహారం పెట్టటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన కోడలు

అత్త వేడి ఆహారం పెట్టటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన కోడలు

Up Woman Calls Police Saying Her Mother Law Serves Stale Food

UP woman calls police saying her mother law serves stale food : ఏ కోడలైనా..అత్త తనను కట్నం కోసం వేధిస్తోందనీ..లేదా మరేరకంగానో వేధిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఓ కోడలు మాత్రం తన అత్తపై పెట్టిన ఓ విచిత్రమైన కేసు గురించి విని పోలీసులే షాక్ అవుతున్నారు. ఏందీ కేసు అనుకుంటున్నారు. ఇంతకీ ఆ కోడలెవరు? కేసేమిటో చూద్దాం..

ఉత్తరప్రదేశ్‌‌ గోరఖ్‌పూర్‌ జిల్లాలో గజ‌హా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని మంజ్‌గ‌న్వాలో ఓ కుటుంబం నివసిస్తోంది. ఈ కుటుంబంలో ఇద్దరు అత్తాకోడళ్లున్నారు. వారి భర్తలిద్దరూ వేరే వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో వీరి ఇంట్లో వీరిద్ధరే ఉంటుంన్నారు. వాళ్లిద్దరి మధ్యలో ఎటువంటి గొడవలున్నాయో తెలీదు గానీ..సదరు కోడలు తన అత్తకు ‘‘వేడి వేడి అన్నం వడ్డించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఇదేం కేసురా బాబూ అంటూ ఆశ్చర్యపోయారు. గత శుక్రవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయం తెలిసినవారంతా కూడా ఆశ్చర్యపోతున్నారు.

తన అత్త తనకు టైముకు భోజనం పెట్టటంలేదనీ..అదికూడా వేడి వేడి ఆహారం పెట్టకుండా..చల్లగా అయిపోయిన ఆహారం పెడుతోందని సదరు కోడలు పోలీసు హెల్ప్‌లైన్ నంబ‌ర్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారింటికి చేరుకుని ద‌ర్యాప్తు చేయగా… ఆమె అత్త రోజంతా‌ టీవీ సీరియ‌ల్స్‌లో లీన‌మైపోతోంద‌ని..అదే పనిగా ఉదయం నుంచి అర్థరాత్రి వరకూ సీరియల్స్ చూస్తూనే కూర్చుంటుందని చెప్పుకొచ్చింది. తనకు పాడైన ఆహారం పెట్టడం వల్ల వేరే దారి లేక అదే తినటం వల్ల తనకు ఆరోగ్యం క్షీణిస్తోంద‌ని కోడలు పోలీసులతో వాపోయింది. కోడలు ఫిర్యాదులు విన్న పోలీసులు షాక్ అయ్యారు.

ఈక్రమంలో తనపై పోలీసులకు లేనిపోనివన్నీ చెబుతోందంటూ కోడలిపై అత్త ఫైర్ అయ్యింది. తన కోడలు పనులు చేయకుండా రోజంతా ఫోన్‌ పట్టుకునే కూర్చుంటుందనీ..ఇంటి పనుల్లో తనకు సాయం చేయడం లేదంటు అత్త పోలీసులకు ఎదురు ఫిర్యాదు చేసింది. అలాగే వంటింటి ప‌నుల్లో కూడా తోడుగా ఉండటంలేదని..కనీసం ఒక్కరోజుకూడా వంట చేసింది లేదంటూ చెప్పుకొచ్చింది.ఇక వారిద్దరి వాద‌న‌లు విన్న పోలీసులకు నవ్వాలో అర్థంకాని అయోమయంలో పడిపోయారు. ఆ తరువాత అత్త‌కోడ‌ళ్ల‌లిద్దరినీ మంద‌లించారు. ఇలాంటి చిన్న విష‌యాల‌కే ఫోన్‌ చేసి పోలీసుల స‌మ‌యం వృథా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించి వెళ్లిపోయారు.