CAA సెగలు: పోలీసులకు భయపడి బతికుండగానే కొడుకుని స్మశానంలో..

CAA సెగలు: పోలీసులకు భయపడి బతికుండగానే కొడుకుని స్మశానంలో..

ఉత్తరప్రదేశ్ ఆందోళనలో ఓ రోజువారీ కూలీ ప్రాణాలతో పోరాడి మరణించాడు. కుటుంబానికి ఆధారంగా నిలిచిన ఆ యువకుడి చనిపోవడంతో 60ఏళ్లు పైబడ్డ పేరెంట్స్ తల్లడిల్లిపోతున్నారు. శుక్రవారం రాత్రి సమయంలో కాన్పూర్ లోని బేగంపూర్వా ప్రాంతానికి కూరగాయల బండిపై చిన్నపిల్లల గుంపు గాయంతో పడిపోయిన మొహమ్మద్ రాయీస్‌ను తీసుకొచ్చారు. అది చూసిన పేరెంట్స్ షాక్ తిని హాస్పిటల్ కు తరలిద్దామనుకునే లోపే స్థానికులు చెప్పిన సలహాతో ఆగిపోయారు. 

ఈ సమయంలో హాస్పిటల్ కు తీసుకెళితే పోలీసులు మీ మీద కూడా కేసులు పెడతారని చెప్పడంతో ఆగిపోయారు. ముందుగా రబ్బరు బుల్లెట్ గాయమే అనుకున్న వాళ్లకు తెల్లారితే కానీ, నిజం తెలియలేదు. ఆ రాత్రంతా రాయీస్ పోలీసులు కొట్టిన దెబ్బలకు, కాల్చిన బుల్లెట్‌కు కడుపులో నుంచి రక్తం కారుతూనే ఉంది. ఎవ్వరికీ తెలియకూడదని చెప్పి తల్లి అతణ్ని స్మశానంలో పడుకోబెట్టింది. 

శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలకు కాన్పూర్ లోని ఈద్ గాహ్ కు వెళ్లాడు రాయీస్. అదే వేదికగా CAAపై ఆందోళనలు జరుగుతున్నాయి. ఇంటికి వచ్చే సమయంలో పోలీసులు దాడి చేశారు. అక్కడ జరిగిన విషయాన్ని గాయాలతో ఉన్న కొడుకు చెప్తేనే కుటుంబానికి తెలిసింది. గాయం తగిలిన వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్తే బతికేవాడని రాయీస్ బావమరిది చెప్తున్నాడు. శుక్రవారం రాత్రి గాయంతో వస్తే శనివారం ఉదయం హాస్పిటల్ కు తీసుకెళ్లారు ఆ పేరెంట్స్. 

అప్పటికీ లాభం లేదు. రెండ్రోజుల పాటు పోరాడి ఆదివారం కన్నుమూశాడు. వైద్యులు దానిని హెపటైటిస్ బీ అనే వైరస్ వల్ల చనిపోయాడని అంటున్నారని బాబుపూర్వా పోలీస్ ఆఫీసర్ వెల్లడించారు. తమ కొడుక్కి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని తల్లిదండ్రులు వాపోతున్నారు. తాము పోలీసులతో పోరాడలేమని తమపై ఎటువంటి దాడులు చేయొద్దంటూ మొరపెట్టుకుంటున్నారు.