ఉత్తరాంధ్ర గద్దర్ వంగపండు ప్రసాదరావు కన్నుమూత

  • Published By: vamsi ,Published On : August 4, 2020 / 07:35 AM IST
ఉత్తరాంధ్ర గద్దర్ వంగపండు ప్రసాదరావు కన్నుమూత

ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి అధ్యక్షుడు. ఉత్తరాంధ్ర గద్దర్‌గా పేరుతెచ్చుకున్న వంగపండు ప్రసాదరావు ఇకలేరు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కళారత్న పురస్కారం అందుకున్న ఆయన గుండెపోటుతో చనిపోయారు.



విజయనగరం జిల్లా పార్వతీపురంకి చెందిన వంగపండు ప్రసాదరావు 1943 జూన్‌లో జన్మించారు. ఆయన ఊరు పార్వతీపురం దగ్గర పెదబొండపల్లి. ప్రజలకోసం బ్రతికిన నాజర్ లాంటి కళాకారుడని వంగపండును పోలుస్తారు. గద్దర్‌తో కలిసి 1972లో పీపుల్స్ వార్ సాంస్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించాడు. వంగపండు మూడు దశాబ్దాలలో 300కు పైగా పాటలు వ్రాశాడు. అందులో 12 పాటలు అన్ని గిరిజన మాండలికాలతో పాటు తమిళం, బెంగాళీ, కన్నడ, హిందీ వంటి పది భారతీయ భాషలలోకి అనువదించబడినవి.

“యంత్రమెట్టా నడుస్తు ఉందంటే…” అనే పాట ఒక ఆచార్యునిచే ఆంగ్లంలో కూడా అనువదించబడి అమెరికా, ఇంగ్లాండులలో కూడా పేరు తెచ్చుకున్నారు. దర్శకులు టి.కృష్ణ, ఆర్‌. నారాయణమూర్తిలతో పాటు మరికొందరు సినిమాలకు మొత్తం 30 సినిమాల వరకు ఆయన పాటలు రాశారు. అలాగే ఆరేడు సినిమాల్లోనూ నటించారు. కొన్ని సినిమాలకు పాటలు రాసే అవకాశాలొచ్చినా జననాట్యమండలి నిబంధనలకు కట్టుబడి ఉన్నారు. సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే నా జీవితం మరోలా ఉండేదని ఆయన చెబుతుండేవారు.



వంగపండు ప్రసాదరావు రాసిన “ఏం పిల్లడో ఎల్దమొస్తవా” పాట తనకు తెలియకుండా, తన అనుమతి పొందకుండా ప్రజా గేయాన్ని మగధీర సినిమాలో ఓ సన్నివేశంలో వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసి దానిని తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఆ పాట శ్రీకాకుళం జిల్లాలోని గ్రామీణ వాసులదని మరికొందరు చెబుతున్నారు.