Old Parliament Building: ఇక అన్నీ కొత్త పార్లమెంట్ భవనంలోనే.. మరి పాత భవనాన్ని ఏం చేస్తారు? కూల్చేస్తారా?

పాతవి ఎప్పడికైనా కొత్తవారికి చోటు ఇవ్వాల్సిందేనని ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ ఓ సందర్భంలో అన్నట్లు, మరో నాలుగు రోజుల్లో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఇక పాత భవనంలో జ్ణాపకాలు మాత్రమే మిగలనున్నాయి. 75 ఏళ్ల ప్రజాస్వామ్య, రాజకీయం ఇక నుంచి నూతన భవనంలోకి వెళ్తోంది

Old Parliament Building: ఇక అన్నీ కొత్త పార్లమెంట్ భవనంలోనే.. మరి పాత భవనాన్ని ఏం చేస్తారు? కూల్చేస్తారా?

New Parliament Building: భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పుడున్న పార్లమెంట్ భవనమే వేదికగా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం కొత్త రాజ్యాంగం ఆమోదించడం సహా.. స్వతంత్ర భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అందులోనే ఏర్పడింది. 75 ఏళ్ల భారత స్వతంత్ర ప్రజాస్వామానికి కేంద్రంగా నిలిచింది. తీవ్రమైన చర్చలు, వాదోపవాదాలు, నవ్వులు, కన్నీళ్లు, నిరసనలు, ఆవేశపూరిత ప్రసంగాలు, ప్రభుత్వాల పనితీరుపై ఓటింగులు సహా ఇప్పుడున్న దేశాన్ని నిర్మించిన ఘతన ఆ భవనానిది. ఎన్నో భావోద్వేగాలు, మరెన్నో అనుబంధాలు పెనవేసుకుని ఉన్న భవనం అది.

అయితే పాతవి ఎప్పడికైనా కొత్తవారికి చోటు ఇవ్వాల్సిందేనని ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ ఓ సందర్భంలో అన్నట్లు, మరో నాలుగు రోజుల్లో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఇక పాత భవనంలో జ్ణాపకాలు మాత్రమే మిగలనున్నాయి. 75 ఏళ్ల ప్రజాస్వామ్య, రాజకీయం ఇక నుంచి నూతన భవనంలోకి వెళ్తోంది. అయితే నూతన భవనం నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది? పాత భవనాన్ని ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

నూతన పార్లమెంట్ భవన నిర్మాణం ఎందుకంటే?
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పాత పార్లమెంట్ భవనం సరిపోవడం లేదు. పెరుగుతున్న అవసరాలను తీర్చేలకపోతోంది. పైగా సాంకేతికంగా కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పుడు హాల్స్ సరిపోవడం లేదు. భవిష్యత్ అవసరాలకు ఎంత మాత్రం ఉపయోగం కాదు. వీటన్నిటి దృష్ట్యా నూతన పార్లమెంట్ భవనం రూపుదిద్దుకుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నూతన భవన నిర్మాణంలో సుమారు 60,000 మంది కార్మికులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల పాటు నిర్మాణ పనులు సాగాయి. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నారు.

పాత పార్లమెంట్ భవనాన్ని ఏం చేస్తారు?
పాత పార్లమెంట్ భవనాన్ని కూల్చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే వారసత్వ సంపదను పరిరక్షించడం తమ బాధ్యత అని ప్రభుత్వం చెబుతోంది. ఆ భవనాన్ని పునరిద్దరించి ప్రత్యామ్నాయ వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ 2021 మార్చిలో రాజ్యసభలో స్పష్టం చేశారు. అదే సమయంలో దీనిపై సమగ్రమైన ఆలోచన చేయలేదని కూడా చెప్పారు. పార్లమెంటులో జరిగే కొన్ని కార్యక్రమాల కోసం దీన్ని వాడనున్నట్లు తెలుస్తోంది.

బ్రిటీష్ వాస్తుశిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్ రూపొందించిన పాత పార్లమెంట్ భవనాన్ని నిర్మించడానికి ఆరు సంవత్సరాలు పట్టింది. 1927లో నిర్మాణం పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చింది. అనంతరం 1956లో అప్పటికి ఉన్న భవనానికి రెండు అంతస్తుల నిర్మాణం జరిగింది. 2006లో ఇందులో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశ 2,500 సంవత్సరాల సుసంపన్నమైన ప్రజాస్వామ్య వారసత్వాన్ని ఈ మ్యూజియంలో చేర్చారు.

ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనం నిర్మాణ వివరాలు..
*ఇప్పటి అవసరాలకు లోక్‌సభ, సెంట్రల్ హాల్స్ సామర్థ్యం నిండిపోయాయి. ఇంతకు మించి విస్తరించడం సాధ్యం కాదు.
*మంత్రుల కార్యాలయాలు, సమావేశ గదులు, భోజన సదుపాయాలు, ప్రెస్‌రూమ్‌లు వంటి సౌకర్యాలు సరిపోవు. ప్రతిసారి తాత్కాలిక ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది.
*చాలా ఏళ్లుగా ఈ భవనానికి అనేక మార్పులు, చేర్పులు చేస్తున్నారు. దీంతో భవనం తీవ్రంగా దెబ్బతిన్నదని ప్రభుత్వం తెలిపింది.
*భవనం యొక్క ఎలక్ట్రికల్, మెకానికల్, ఎయిర్ కండిషనింగ్, లైటింగ్, ఆడియో-విజువల్, ఎకౌస్టిక్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నీ పాతవి. వీటిని ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడున్న భవనంలో అది సాధ్యం కాదు.
*భూకంపాలు వంటివి సంభవిస్తే ఇప్పుడున్న భవనం నిలబడలేకపోవచ్చు. భవనాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటికి ఎలాంటి ప్రణాళికలు వేయలేదు. వాటికి అనుకూలంగా కూడా ప్రస్తుతం లేదు.
*అగ్నిమాపక నిబంధనల ప్రకారం భవనం రూపకల్పన చేయకపోవడంతో అగ్ని భద్రత ప్రధాన ఆందోళన కలిగిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో, తరలింపు ఏర్పాట్లు సరిపడా జరగవు.