BJP Vs INDIA: బీజేపీ సమరోత్సాహం.. బాలరిష్టాలను దాటని ఇండియా కూటమి.. పవార్ ట్విస్ట్ ఏంటో?

ఇటు కాంగ్రెస్, అటు బీజేపీతో టచ్‌లో ఉన్న శరద్ ఎలాంటి ట్విస్టు ఇస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు. అదే సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ మధ్య కొత్త పోరు ప్రారంభమైంది.

BJP Vs INDIA: బీజేపీ సమరోత్సాహం.. బాలరిష్టాలను దాటని ఇండియా కూటమి.. పవార్ ట్విస్ట్ ఏంటో?

Narendra Modi, Rahul Gandhi

BJP Vs INDIA: దేశంలో ఎన్నికల మేఘాలు కమ్ముకుంటున్నాయి. మరికొద్ది నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికలు.. ఇలా వచ్చే ఆరేడు నెలలు దేశంలో ఎన్నికల పండగే.. సార్వత్రిక సమరానికి ముందుగా జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న బీజేపీ (BJP) దూకుడు చూపుతోంది. ముఖ్యంగా ప్రధాని మోదీ.. వరుసగా మూడో సారి గెలుపు కోసం తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష కూటమి ఇండియా (INDIA) ఇంకా బాలరిష్టాల దశను దాటడం లేదు. పాట్నా, బెంగళూరు (Bengaluru) భేటీ తర్వాత ముంబైలో మరోమారు సమావేశమవ్వాల్సిన ఇండియా కూటమిలో అనేక వైరుధ్యాలు బయటపడుతున్నాయి. ప్రధాని మోదీ (PM Modi) జోరుకు విపక్ష కూటమి బేజారు అవుతోందా? సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ప్లాన్ ఏంటి? హాట్రిక్ విజయానికి ఎలా ప్రయత్నిస్తోంది.?

మీరు రాసిపెట్టుకోండి వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం నాడూ నేనే జెండా ఎగురవేస్తా.. ఆగస్టు 15 వేడుకల్లో ప్రధాని మోదీ అన్న మాటలివి.. ఈ ఒక్క ప్రకటనతో ప్రధానిలో ఆత్మ విశ్వాసం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. వరుసగా రెండుసార్లు బీజేపీని గెలిపించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ.. మూడోసారి అదే స్థాయి విజయంపై నమ్మకం పెట్టుకున్నారు. తనను ఎదిరించే నేతగాని.. తన పార్టీని ఓడించే ప్రత్యామ్నాయ కూటమి గాని దేశంలో లేదనేది ప్రధాని మోదీ నమ్మకం… తన పని తాను చేసుకుపోవడం.. అవసరం వచ్చినప్పుడు తానేంటో నిరూపించడం ప్రధాని మోదీ స్టైల్.. ఊక దంపుడు ఉపన్యాసాలు ఉండవు. చెప్పాల్సినదేదో సూటిగా చెప్పడమే మోదీ మార్కు మేనరిజం.. అందుకోసం సరైన వేదిక ఎంచుకోవడం కూడా ప్రధానికే చెల్లింది. ఎన్నికల ముందు తనను కవ్విస్తున్న విపక్షాన్ని అదును చూపి దెబ్బకొట్టారు ప్రధాని మోదీ. కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని.. ఎదురుదాడి చేశారు.

ఎంతసేపు నాపై మాటల దాడి చేయడమే కాని.. మీరు ఏం చేస్తారో చెప్పడం లేదు. మీరు మారతారని తొమ్మిదేళ్లుగా ఎదురుచూసినా.. మారలేదు అంటూ విపక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు మోదీ… తనను గద్దె దింపడమే విపక్షాల అజెండా కాని.. వారు ఎందుకు అధికారంలోకి రావడం లేదో చెప్పటం లేదని ఇండియా కూటమిపై మాటల దాడి చేసిన ప్రధాని.. కేవలం ప్రకటనలకే పరిమితం కావడం లేదు. చాప కింద నీరులా బీజేపీ బలోపేతానికి తాను చేయాల్సినదంతా చేసేస్తున్నారు. వచ్చే మార్చి-ఏప్రిల్ నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ముందే ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, మిజోరం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో రెండు చోట్ల ఆంగ్రెస్ అధికారంలో ఉంది. ఇంకా చెప్పాలంటే మధ్యప్రదేశ్‌లో మాత్రమే బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ ఐదు రాష్ట్రాల్లో ఎలాగైనా గెలవాలన్నది ప్రధాని టార్గెట్. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బలపడిందనే వాదనకు.. ఈ ఎన్నికల్లో చెక్ పెట్టాలని చూస్తున్న ప్రధాని అవసరమైన వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.

Also Read: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ.. తెలంగాణ అభ్యర్థుల జాబితా ఎప్పుడంటే?

ఎన్డీయే కూటమిని పునర్వ్యస్థీకరించిన ప్రధాని.. బీజేపీ సంస్థాగత మరమ్మతులు పూర్తి చేశారు. బూత్ లెవెల్ కన్వీనర్ల నుంచి పార్టీ జాతీయ కార్యదర్శుల వరకు వివిధ దశల్లో సమావేశాలు నిర్వహించారు ప్రధాని. మధ్యప్రదేశ్‌లో రెండు వేల ఐదు వందల మంది బూత్ కన్వీనర్లతో సమావేశమైన ప్రధాని.. అక్కడి నుంచి ఆన్‌లైన్‌లో మిగిలిన రాష్ట్రాల్లోని కార్యకర్తలతో ఏకకాలంలోనే సమావేశమై పార్టీని ఎన్నికలకు సంసిద్ధం చేశారు. గెలవడం ఒక్కటే టార్గెట్‌గా నిర్ణయించారు. ప్రధానిగా మోదీని ఎన్నుకుంటారో… విపక్షంలోని కుటుంబ పార్టీలను గెలిపించి అవినీతికి అండగా నిలుస్తారో ఓటర్లే తేల్చుకోవాలని.. బూత్ కన్వీనర్లు అంతా ఈ విషయంపైనే ప్రధానంగా ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు ప్రధాని మోదీ. విపక్షంలో ఉన్న కాంగ్రెస్ గాంధీల కుటుంబం.. ఎన్సీపీలో శరద్‌పవార్ కుటుంబం, తృణమూల్‌లోని మమత కుటుంబం, డీఎంకేలోని స్టాలిన్ కుటుంబం, జార్ఖండ్‌లోని సొరేన్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని ప్రచారం చేయాలని నిర్దేశించారు ప్రధాని.

Also Read: 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంత ఖర్చు చేసిందంటే…

ఇలా క్యాడర్‌ను సమాయుత్తం చేయడంతోపాటు ఎన్నికల్లో గరిష్టంగా సీట్లు దక్కించుకునే స్కీమ్‌లకు పచ్చజెండా ఊపుతున్నారు. 13 వేల కోట్లతో విశ్వకర్మ యోజన పథకం ప్రారంభించడం ఎన్నికల ఎత్తుగడే అన్న వాదన వినిపిస్తోంది. అదేసమయంలో హిందీ బెల్ట్‌లోని ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు దక్కించుకునేలా చిన్నాచితకా పార్టీలను కలుపుకుని వెళుతోంది బీజేపీ. ఓబీసీలు, దళితుల ఓట్లపై గురిపెట్టి ఆయా రాష్ట్రాల్లో వ్యూహాలు పన్నుతోంది. ఇలా ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ సమరోత్సాహంతో ఎన్నికలకు సిద్ధమవుతుండగా.. ఎలాగైనా గెలుస్తామని ప్రకటనలు చేస్తున్న విపక్ష ఇండియా కూటమి ఇంకా బాలరిష్టాల నుంచి బయటపడినట్లు కనిపించడం లేదు.

Also Read: రాజస్థాన్ బీజేపీ ఎన్నికల కమిటీల్లో మాజీ సీఎంకు దక్కని చోటు

బీజేపీకి వ్యతిరేకంగా జట్టుకట్టిన 26 పార్టీల కూటమిలో రాజకీయం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఎన్నికలు తరుముకొస్తుండగా.. రోజుకో ట్విస్టుతో ఇండియా కూటమి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఇండియా కూటమి ఆవిర్భావం తర్వాత మరాఠా నేత శరద్‌పవార్ పార్టీ రాజకీయం చర్చనీయాంశమైంది. రెండు వర్గాలుగా ఈ పార్టీ చీలిపోయింది. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిలోనే ఉంటామని చెబుతున్న పవార్.. చీలిక వర్గంతోనూ టచ్‌లో ఉంటున్నారు. ఎప్పటికప్పుడు అజిత్ పవార్‌తో భేటీ అవుతూ పొలిటికల్ సర్కిల్స్‌లో సరికొత్త చర్చకు తెరలేపుతున్నారు. మహారాష్ట్రలో శివసేన కూటమిని చీల్చి ఉద్ధవ్ ఠాక్రేతో పూర్తి శతృత్వం పెట్టుకున్న బీజేపీ.. అదే సమయంలో ఎన్సీపీని రెండు ముక్కలు చేసినా శరద్‌తో సన్నిహిత సంబంధాలనే కోరుకోవడం ఆసక్తికరంగా మారింది.

Also Read: మహిళా ఎంపీతో గొడవ పెట్టుకున్న రవీంద్ర జడేజా భార్య.. వీడియో వైరల్

ఇటు కాంగ్రెస్, అటు బీజేపీతో టచ్‌లో ఉన్న శరద్ ఎలాంటి ట్విస్టు ఇస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు. అదే సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ మధ్య కొత్త పోరు ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో అన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ ఏకపక్ష ప్రకటన విడుదల చేయడంపై ఆప్ ఆభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అలాగైతే కూటమిలో కొనసాగడంపై ఆలోచిస్తామని విస్పష్టంగా ప్రకటించింది ఆప్… ఇదేకాదు కేంద్రంపై మూకుమ్మడిగా పోరాడతామంటున్న విపక్షం.. డీఎంకే విషయంలో ఎలాంటి ముందడుగు వేయలేకపోవడం కూడా చర్చనీయాంశమవుతోంది. తమిళనాడు గవర్నర్, కేంద్ర సంస్థలు డీఎంకేను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా.. ఇతర పార్టీలు అండగా నిలలేకపోవడం కూడా బీజేపీకి అడ్వాంటేజ్‌గా మారుతోంది.