జీ-7సదస్సులో పాల్గొనేందుకు…ఫ్రాన్స్ కు మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : August 25, 2019 / 08:56 AM IST
జీ-7సదస్సులో పాల్గొనేందుకు…ఫ్రాన్స్ కు మోడీ

బహ్రెయిన్‌ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి నేరుగా ఫ్రాన్స్‌ బయలుదేరారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈరోజు జరగబోయే జీ-7 దేశాల సదస్సులో ప్రత్యేక ఆహ్వానితునిగా మోడీ పాల్గొంటారు. అంతకు ముందు బహ్రెయిన్‌ రాజధాని మనామాలో కొత్త హంగులతో పునరుద్ధరించిన శ్రీనాథ్‌జీ ఆలయాన్ని ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శనివారం బహ్రెయిన్‌ రాజు హమద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ద కింగ్‌ హమద్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది రెనైసాన్స్‌’తో మోడీని సత్కరించారు. మనామాలో వేలమంది భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించిన విషయం తెలిసిందే.

ఫ్రాన్స్‌లో జరుగుతున్న జి-7 సదస్సులో భారత ప్రధాని మోదీ ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొంటారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రత్యేకంగా భేటీ కానున్నట్టు సమాచారం. భారత్‌లో అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించాలని, తమ వాణిజ్యానికి ద్వారాలు తెరవాలని ట్రంప్‌ కోరనున్నట్టు అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఈ సందర్భంగా తమిద్దరి మధ్య ఆర్టికల్ 370రద్దు గురించిన ప్రస్తావన వచ్చే అవకాశముందని ఇటీవల ట్రంప్ అన్న విషయం తెలిసిందే.