అసమ్మతి స్వరాన్ని అణిచివేయలేం : స‌చిన్ పైల‌ట్‌కు ఊర‌ట..స్పీకర్ కు సుప్రీం ఝలక్ ‌

  • Published By: venkaiahnaidu ,Published On : July 23, 2020 / 03:46 PM IST
అసమ్మతి స్వరాన్ని అణిచివేయలేం : స‌చిన్ పైల‌ట్‌కు ఊర‌ట..స్పీకర్ కు సుప్రీం ఝలక్ ‌

రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలకు స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేయడం, సచిన్​ పైలట్​ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్ట్ నిర్ణయంపై బుధవారం(జులై-22,2020) సుప్రీం కోర్టును ఆశ్రయించారు స్పీకర్​ సీపీ జోషి.

స్పీకర్ పిటిషన్ పై ఇవాళ(జులై-23,2020) విచారించిన సుప్రీం కోర్టు.. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలన్న స్పీకర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. హైకోర్టులో ఉన్న‌కేసుపై స్టే ఇవ్వ‌లేమ‌ని సుప్రీం చెప్పింది. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేసేందుకు హక్కు ఉండదా’ అని వ్యాఖ్యానించింది. ఇలా చ‌ర్య‌లు తీసుకుంటే అదే అల‌వాటుగా మారుతుంద‌ని, అప్పుడు వారు త‌మ స్వ‌రాన్ని వినిపించ‌లేర‌ని, ప్ర‌జాస్వామ్యంలో అస‌మ్మ‌తి స్వ‌రాన్ని ఇలా నొక్కిపెట్ట‌లేమ‌ని జ‌స్టిస్ మిశ్రా అన్నారు.

అసమ్మతివాదుల అభిప్రాయాలను అణిచివేయకూడదని ధర్మాసనం పేర్కొంది. ఏ అంశం ఆధారంగా అనర్హత వేటు వేయాలనుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో ఈ తరహా విధానాలు సరికాదని వెల్లడించింది. దీంతో రెబ‌ల్ ఎమ్మెల్యేలు వేసిన పిటిష‌న్‌పై శుక్ర‌వారం హైకోర్టు త‌న తీర్పును వెలువ‌రించేందుకు మార్గం సులువైంది. ఈ వ్యవహారంపై విచారణను హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదలాయించాలని రాజస్తాన్‌ అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.