ఏపీలో జరిగినట్టే యూపీలో జరిగింది : ఎస్పీకి ఓటు వేస్తే బీజేపీకి పడింది

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 09:41 AM IST
ఏపీలో జరిగినట్టే యూపీలో జరిగింది : ఎస్పీకి ఓటు వేస్తే బీజేపీకి పడింది

ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరుబాట్టిన ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి ఈవీఎంల పనితీరుపై విమర్శలు చేశారు. ఏపీలో జరిగినట్టే మిగతా రాష్ట్రాల్లో ఈవీఎంలు మొరాయించాయని చంద్రబాబు  అన్నారు. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీకి ఓటు వేస్తే బీజేపీ గుర్తుకి ఓట్లు పడ్డాయని చంద్రబాబు ఆరోపించారు. వెస్ట్ బెంగాల్ లో కావాలనే ఏడు దశల్లో ఎన్నికలు పెట్టారన్న చంద్రబాబు..  హింస, విధ్వంసాలతో పోలింగ్ శాతాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగాయని ఆరోపించారు. ఈవీఎంలపై ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. తమ పోరాటం ఫలితంగానే వీవీప్యాట్  స్లిప్పులు తెచ్చారని అన్నారు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని, అందుకే 50శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని కోరుతున్నామని చంద్రబాబు చెప్పారు.
Also Read : మే మూడో వారంలో ఏపీ ఎంసెట్ ఫలితాలు

చాలా దేశాల్లో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. మన దేశంలో కూడా బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఒకే  విధానం ఉండాలన్నారు. తెలంగాణలో పోల్ అయిన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని చంద్రబాబు అన్నారు. ఈసీ చేసే తప్పులపై మాట్లాడితే కేసు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కింపు అంశంలో ఈసీ వాదన కరెక్ట్ కాదన్న చంద్రబాబు.. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశంపై మరోసారి కోర్టుకు వెళ్తామన్నారు. ఈవీఎంలలో ఎక్కడైనా తప్పులు జరిగితే  మాన్యువల్ గా లెక్కించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Also Read : పీఎంకి ఒక రూల్.. సీఎంకి ఒక రూల్ ఉంటుందా