ఈసీ పక్షపాతం : రీ పోలింగ్‌పై బాబు అసంతృప్తి

  • Published By: madhu ,Published On : May 16, 2019 / 01:05 AM IST
ఈసీ పక్షపాతం : రీ పోలింగ్‌పై బాబు అసంతృప్తి

ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలో మరోసారి పోలింగ్‌ నిర్వహించాలని ఈసీ నిర్ణయంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మే 19వ తేదీన 5 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు మే 15వ తేదీ బుధవారం ఈసీ తెలిపింది. దీనిపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ అడిగిన బూత్‌లను పరిగణనలోకి తీసుకోకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ అడిగిన 7 బూత్‌లలో 5 బూత్‌లకు ఎన్నికలు జరపడం సరికాదన్నారు. టీడీపీ అడిగిన స్థానాల్లోనూ రీపోలింగ్‌ జరపాలని తెలిపారు. ఈసీ పక్షపాత ధోరణి మరోసారి రుజువైందన్నారు. రీపోలింగ్‌పై మే 16వ తేదీ గురువారం ఎన్నికల కమిషన్‌కు మరో లేఖ రాస్తామని చంద్రబాబు చెప్పారు.

మరోవైపు ఎన్నికల సంఘం అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని… టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. అడిషనల్ సీఈవో సుజాత శర్మను..కళా వెంకట్రావు కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా 49 పోలింగ్ బూత్‌ల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేశారు. వీటిలో రీపోలింగ్ జరగాలని కోరారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 166, 310 బూతుల విషయంలో వచ్చిన ఫిర్యాదుపై… సీఈవో విచారణకు ఎందుకు ఆదేశించారని అడిగారు. పోలింగ్ రోజున ఆ రెండు బూత్‌లపై టీడీపీ అభ్యర్థి నాని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.

ఇప్పటికే ఈనెల 6న రాష్ట్రంలో ఐదు స్థానాల్లో రీపోలింగ్ నిర్వహించారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మరో 5చోట్ల రీపోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నారు. మే 19న రీపోలింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని వెల్లడించింది.